8 August, 2026 | 1:17 AM

ఎక్లాస్పూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక

08-08-2026 12:02 AM

విద్యార్థి మృతి అత్యంత దురదృష్టకరం

బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది.

నారాయణపేట. ఆగస్టు 7 (విజయక్రాంతి): నారాయణపేట మండలం ఎక్లాస్పూర్ ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక సందర్శించారు. ఈ నెల 6వ తేదీన ఆ పాఠశాలలో మూడో తరగతి విద్యార్థి రంజిత్ పాముకాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన దురదృష్టకర ఘటన నేపథ్యంలో కలెక్టర్ పాఠశాలను సందర్శించి, విద్యార్థి పాముకాటుకు గురైన తరగతి గది, కిటికీలు, పాఠశాల పరిసరాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా విద్యార్థి మృతిపట్ల కలెక్టర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, వారికి ప్రభుత్వం అవసరమైన మౌలిక వసతులు, విద్యా సదుపాయాలను కల్పిస్తోందని తెలిపారు. అయినప్పటికీ ఎక్లాస్పూర్ పాఠశాలలో జరిగిన ఈ ఘటన అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

పాఠశాలను సమగ్రంగా పరిశీలించి, అవసరమైన మరమ్మతులు, అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని ఇంజినీరింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. ముఖ్యంగా పాఠశాల వెనుక భాగంలో ఉన్న పొదలు, చెట్లు, కొండ ప్రాంతాలను పూర్తిగా శుభ్రపరిచి, విద్యార్థుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) నుంచి ప్రత్యేక ఆర్థిక సహాయం అందేలా ఇప్పటికే సంబంధిత ప్రతిపాదనలు పంపించామని, అర్హత మేరకు త్వరితగతిన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భరోసా ఇచ్చారు.

అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్తో సమన్వయం చేసుకొని పాఠశాలలో టాయిలెట్లు, బాత్ రూములు, భద్రతా గోడలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన పరిపాలనా అనుమతులను (సాంక్షన్లు) తక్షణమే మంజూరు చేసేలా చర్యలు చేపడతామని తెలిపారు. విద్యార్థుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్న కలెక్టర్, జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను సమగ్రంగా సమీక్షించి, అవసరమైన చోట మరమ్మతులు, అభివృద్ధి పనులను వెంటనే చేపట్టి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు.