17-12-2025 09:02:00 PM
* రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు మౌళిక సౌకర్యాల ఏర్పాటు
* ఈఓ : రమాదేవి
వేములవాడ (విజయక్రాంతి): సమ్మక్క-సారలమ్మ మహా జాతరను పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భారీగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం కోడె ఉచిత దర్శనం, రూ.100 ప్రత్యేక దర్శనం, రూ.300 అతి శీఘ్ర దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దర్శన క్యూలైన్ల వద్ద అవసరమైన మేరకు వాష్‌రూమ్ సదుపాయాలు కల్పించారు.
అలాగే భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన కళ్యాణకట్ట, స్నానాల కోసం షవర్స్, తాగునీటి కోసం నూతన వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీరు, పరిశుభ్రత లోపించకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు ఆలయ ఈఓ రమాదేవి తెలిపారు. వీఐపీ రోడ్ మార్గంలో భక్తులను ఆకట్టుకునే విధంగా స్వామి, అమ్మవార్ల డిజైన్లు, ఫోటోలతో ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. విద్యుత్ దీపాల అలంకరణలు, పారిశుధ్య నిర్వహణతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను పటిష్టంగా అమలు చేయాలని ఆలయ ఈఓ రమాదేవి సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు, ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.