17-12-2025 10:12:46 PM
నారాయణఖేడ్: నారాయణఖేడ్ నియోజకవర్గంలో తుది విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుండి ఓటింగ్ మొదలవుగా మధ్యాహ్నం 1:00 వరకు పోలింగ్ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం రెండు తర్వాత ఓటింగ్ కౌంటింగ్ ప్రారంభమవ్వగా రాత్రి 8 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. చిన్న గ్రామ పంచాయతీలలో సాయంత్రానికి ఫలితాలు వెలుబడగా 1000కి పైగా ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీల ఫలితాలు కాస్త ఆలస్యంగా వెలువడినాయి.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో 196 గ్రామ పంచాయతీలో గాను ఏకగ్రీవంతో కలుపుకొని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన 138 మంది అభ్యర్థులు విజయం సాధించగా బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులలో 50 పంచాయతీ స్థానాల్లో గెలుపొందింది. నారాయణఖేడ్ చరిత్రలో మొదటిసారిగా బిజెపి నాలుగు స్థానాలను కైవసం చేసుకోగా మరో నాలుగు చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు.
స్థానిక పోరులో భాగంగా నారాయణఖేడ్ మండల పరిధిలో జూకల్ లో కొద్దిపాటి ఘర్షణ చోటుచేసుకుంది. కాగా కొన్ని పంచాయతీల్లో చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఏది ఏమైనా ఎక్కడ కూడా పెద్ద గొడవలు జరగకుండా పోలీసు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తిరిగి రాత్రి వరకు పోలింగ్ సిబ్బంది నారాయణఖేడ్ నియోజకవర్గానికి ప్రత్యేక వాహనాలను చేరుకున్నారు.