2 July, 2026 | 1:50 AM

పోలీస్ అధికారినంటూ వసూళ్లు

02-07-2026 12:51 AM

అదుపులోకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు

కుత్బుల్లాపూర్, జూలై 1(విజయక్రాంతి): పోలీస్ అధికారిగా నటిస్తూ బాలికల హాస్టల్ నివాసితుల నుండి అక్రమంగా డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్ధిపేట జిల్లా బండ మైలారం కు చెందిన పాండి యాదగిరి (25) గతంలో మహంకాళి ట్రాఫిక్ పోలీసుల వద్ద క్యాజువల్ లేబర్ గా పని చేశాడు.

ఆ సమయంలో పోలీసుల పనితీరు, ప్రజలతో పోలీసుల వ్యవహారశైలిపై అవగాహన ఏర్పడింది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఉద్దేశపూర్వకంగా పోలీస్ యూనిఫామ్, పోలీస్ తరహా జెర్కిన్ ను సమకూర్చుకున్నాడు.అలాగే తిరగడానికి ఒక బైక్ కొనుగోలు చేసి పోలీస్ అధికారిగా నటిస్తూ మోసలకు పాల్పడడం ప్రారంభించాడు. నిందితుడు మొదట దుండిగల్ లోని ఒక బాలిక హాస్టల్ ను లక్ష్యంగా చేసుకొని, పోలీస్ కానిస్టేబుల్ గా నటిస్తూ డబ్బు వసూళ్లు చేసేవాడు.

తర్వాత పేట్ బషీరాబాద్ మేడ్చల్ హైవే పై పలుమార్లు ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ గా నటిస్తూ,ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసుల పేరుతో వాహనదారులను బెదిరించి డబ్బు వసూళ్లు చేశాడు. అయితే నిందితుడు పదిహేను రోజుల ముందు సుచిత్ర లోని మోనిడా శ్రీ గరల్స్ హాస్టల్ ను సందర్శించి, ప్రతి రోజూ రాత్రి 10:30 గంటలకల్లా హాస్టల్ కార్యకలాపాలు నిలిపివేసేలా చూడాలని యాజమాన్యాన్ని తప్పుగా హెచ్చరించాడు. జూన్ నెల 29 వ తేదీన నిందితుడు రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో హాస్టల్ కు వెళ్లి, అక్కడ ఉంటున్న అమ్మాయిలను వ్యభిచార కేసులు పెడతానని బెదిరించి, వారి మొబైల్ ఫోన్లను బలవంతంగా తీసుకొని ఫోటోలు తీశాడు.

కేసు అవ్వకుండా ఉండాలంటే 5,000 ఇవ్వాలని డిమాండ్ చేసి చివరకు వారి నుండి 2000 వసూళ్లు చేశాడు. హాస్టల్ యజమాని గూడూరు విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు  నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడి నుండి 2,000 నగదు, పోలీస్ యూనిఫామ్,రెడ్మి స్మార్ట్ ఫోన్, పల్సర్ బైక్, బొమ్మ తుఫాకి స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ అధికారులమని చెప్పుకునే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నకిలీ వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని లేదా 100 నెంబర్ కు డయల్ చేయాలని కోరారు.