06-06-2025 08:52:58 PM
నేత్రదానంపై ప్రజలలో పెరుగుతున్న అవగాహన, సహకరిస్తున్న కుటుంబాలు
లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఐ డొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నేత్రదానం
నల్గొండ,(విజయక్రాంతి): నల్గొండ పట్టణం శివాజీ నగర్ ప్రాంతానికి చెందిన మారోజు కౌసల్య(86) శుక్రవారం మరణించగా వీరి కుమారులు భీష్మ కుమార్, విశ్వవిజయ్ కుమార్ బంధుమిత్రులు సదానంద్, ప్రవీణ్, బుచ్చి రామాచారిలను సంప్రదించగా వీరి మరణానంతర నేత్రదానానికి అంగీకరించడంతో నేత్రదాన సేకరణ చేశారు. అదేవిధంగా పద్మావతి కాలనీ ప్రాంతానికి చెందిన కొప్పరపు వెంకట రాయ శర్మ (82) స్వర్గస్తులు కాగా వీరి కుమారుడు కొప్పరపు బుచ్చిరామయ్య, కోడలు అంజనీదేవి లను సంప్రదించి మరణానంతర నేత్రదాన ప్రాముఖ్యతను వివరించగా వీరి అంగీకారంతో నేత్రదాన సేకరణ జరిగింది.
లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ టెక్నీషియన్(Lions Club of Nalgonda Charitable Trust Eye Donation Center Technician) బచ్చలకూర జానీ, మేనేజర్ డాక్టర్ పుల్లారావు నేత్రదాన సేకరణ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ - ఐ డొనేషన్ సెంటర్(Lions Club of Nalgonda Eye Donation Center) మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులలో ఒకరు మన నుంచి దూరం అవటం ఎంతో బాధ కలిగించే విషయమని, కుటుంబమంతా తీవ్రమైన దుఃఖంలో ఉండి, ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్న సమయంలో కూడా నేత్రదానం చేయుట ఎంతో గొప్ప విషయం అని, మరణానంతరం 6 నుండి 8 గంటల లోగా నేత్రదానం చేయించవలెనని, ఒకవేళ పార్థివదేహాన్ని ఫ్రీజర్ బాక్స్ లో ఉంచినట్లయితే 15 గంటల వరకు నేత్రదానం చేయించవచ్చని, ఈ నేత్రదానం ద్వారా సేకరించిన కార్నియాఅను కంటిపొరలను ఇద్దరి నుండి నలుగురికి అమర్చి కంటిచూపును ప్రసాదించవచ్చన్నారు.
నేత్రదానం చేయుటకు తమ ఫోన్ నెంబర్ 9948143299 నందు సంప్రదించాలని కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల కోరారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ - అడ్వకేట్ కేవీ ప్రసాద్ మాట్లాడుతూ వీరిని ఆదర్శంగా తీసుకొని ప్రజలందరూ నేత్రదానం చేయించుటకు ముందుకు రావాలని అని తెలిపారు. ఈ విధముగా సేకరించిన 260 కార్నియా అను కంటిపొరల ద్వారా 260 మందికి పైగా 'కార్నియా అంధుల'కు కంటి చూపుని అందించగలిగామని, నేత్రదాతకు కావలసిన ఫ్రీజర్ బాక్స్ ను తమ ఎల్.వి. సేవా సంస్థ ద్వారా పూర్తి ఉచితంగా ఇస్తున్నామని లయన్ ఎల్ వి కుమార్ పేర్కొన్నారు.