కంటి పరీక్షలు చేసి.. అద్దాలు మరిచారు
- 1,400మంది విద్యార్థులకు దృష్టి లోపం
- ఏప్రిల్‌లో పరీక్షలు.. ఇప్పటికీ పత్తాలేని కళ్లజోళ్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (విజయక్రాంతి): వయసుతో సంబంధం లేకుండా పిల్లల్లో దృష్టి లోపం సమస్యలు బయటపడుతుండటంతో రెండేళ్ల క్రితం గత ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించింది. గత ఏప్రిల్‌లోనూ రాష్ట్ర ప్రభు త్వం విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టింది. ఇరవై రోజులకు పైగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లాలోని 52 బీసీ హాస్టళ్లు, 32 ఎస్సీ హాస్టళ్లు, 14ఎస్టీహాస్టళ్లు, ఐదు జనరల్ హాస్టళ్లు, 40 మైనార్టీ రెసిడెన్సియళ్లలోని 10,668 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు.
దాదాపు 1,400మందికి కంటి సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ చేశారు. కానీ వారికి కళ్లజోళ్లను ఇవ్వడం మాత్రం మరిచారు. ఐదు నెలలు పూర్తయినా కళ్లజోళ్లను ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో చదవడం, రాయడంలో ఆ విద్యార్థులు వెనకబడుతున్నారు. కళ్లద్దాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం, వైద్యశాఖ అధికారుల తీరుపై విద్యార్థుల తల్లిదం డ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లాలోని అన్ని హాస్టళ్ల విద్యార్థులకు ఇంకా పూర్తి స్థాయిలో కంటి పరీక్షలు నిర్వహించకపోవడం గమనార్హం.
దానికి తోడు హాస్టళ్లలో పరీక్షలు నిర్వహించిన సమయంలో ఎక్కువ మంది విద్యా ర్థులు హాస్టళ్లలో ఉండని కారణంగా మరి కొంత మంది కంటి పరీక్షలు చేయించుకోలేదు. కాగా కంటి పరీక్షల్లో దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కావలసిన కళ్లజోళ్ల వివరాలను ప్రభుత్వానికి పంపించామని సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. ప్రభుత్వం నుంచి రాగానే విద్యార్థులకు అందజేస్తామంటున్నారు.






