26-12-2025 09:58:39 PM
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ,(విజయక్రాంతి): సమ్మక్క–సారక్క జాతర ప్రారంభంతో వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, శ్రీ బద్ది పోచమ్మ ఆలయం సహా అనుబంధ దేవాలయాలకు భక్తుల రాక పెరిగిన నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారులకు సూచించారు.
శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో ఆలయ ఈఓఎల్ రమాదేవి, అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో త్రాగునీరు సరఫరా, చలవ పందిర్లు, క్యూలైన్ నిర్వహణ, పారిశుధ్య పనులు క్రమబద్ధంగా చేపట్టాలని ఆదేశించారు. జాతర రోజులలో రద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకునేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, సేవాభావంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.