14-07-2025 02:03:27 AM
- జిమ్ బాడీల మోజులో యువతే లక్ష్యం
-ఇద్దరి అరెస్ట్, రూ.5 లక్షల విలువైన మందులు స్వాధీనం
హైదరాబాద్, సిటీబ్యూరో జూలై 11 (విజయక్రాంతి): నగరంలో జిమ్ బాడీల మోజులో ఉన్న యువతను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న నకిలీ ఇంజెక్షన్ల దందాను కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా, అధిక ధరలకు అమ్ముతున్న ప్రాణాంతక మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ల రాకెట్‌ను గుట్టురట్టు చేశారు. సౌత్-ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్, చత్రినాక పోలీసులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
వారి నుంచి రూ. 5 లక్షల విలువైన నకిలీ మందులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మోడలింగ్ వృత్తిలో ఉన్న మహ్మద్ జుబేర్, మెడికల్ డిస్ట్రిబ్యూటరైన వెలుదండి వినయ్ కుమార్ తో కలిసి ఈ దందాకు తెరలేపాడు. వినయ్ కుమార్ ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన కపిల్ గౌతమ్ అనే వ్యక్తి నుంచి ఈ ఇంజెక్షన్లను అక్రమంగా కొనుగోలు చేసి నగరానికి తరలిస్తున్నాడు.
అనంతరం, శరీర వృద్ధిని వేగవంతం చేస్తాయని, కండరాలు త్వరగా వస్తాయని యువతను, ముఖ్యంగా జిమ్‌కు వెళ్లేవారిని నమ్మించి, ఈ ఇంజెక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. మొదట ఈ ఇంజెక్షన్లకు బానిసైన జుబేర్, ఆ తర్వాత వినయ్ కుమార్‌తో చేతులు కలిపి విక్రయాలు మొదలుపెట్టాడు.
పక్కా సమాచారంతో దాడి
నగరంలో నకిలీ ఇంజెక్షన్ల దందా జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు, నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. సరైన ఆధారాలతో చత్రినాక పోలీసుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను అడిషనల్ డీసీపీ టాస్క్‌ఫోర్స్ ఆండె శ్రీనివాసరావు మార్గదర్శకత్వంలో, సౌత్-ఈస్ట్ జోన్ ఇన్స్పెక్టర్ ఎస్.సైదాబాబు పర్యవేక్షణలో ఎస్‌ఐలు కె.రామారావు, ఎం.మధు, సిబ్బం ది విజయవంతంగా పూర్తి చేశారు. ఇలాంటి నకిలీ ఔషధాల పట్ల ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని, వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడొద్దని పోలీసులు హెచ్చరించారు.