09-10-2025 01:01:06 AM
- అధిక లాభాల ఆశ చూపి పెట్టుబడుల సేకరణ
- ఫేక్ యాప్‌తో రూ.కోట్లలో టోకరా
- ఐదుగురు నిందితుల అరెస్ట్
- రూ.14 లక్షల నగదు స్వాధీనం
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో అమాయకులకు వల వేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న భారీ మోసాన్ని సైబ రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. ‘రిచ్ రివార్డ్స్ అనే నకిలీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా అధిక లాభాల ఆశ చూపి వందలాది మంది నుంచి పెట్టుబడులు సేకరించి, ఆ తర్వాత సర్వర్లు మూసేసి మోసానికి పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేశారు.
ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.14 లక్షల నగదు, ఎనిమిది మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ‘రిచ్ రివార్డ్స్ అనే ఒక ఫేక్ గేమింగ్ యాప్‌ను సృష్టించారు. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా దీనికి విస్తృతంగా ప్రచారం కల్పించారు. ఈ యాప్‌లో పెట్టుబడి పెడితే గేమింగ్ ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మబలికారు. నమ్మిన ఎంతోమంది బాధితులు రూ.వేల నుంచి రూ.లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు.
పెద్ద మొత్తం లో డిపాజిట్లు జమ కాగానే, నిందితులు ఒక్కసారిగా యాప్‌కు సంబంధించిన సర్వర్లను ఆపేశారు. మోసపోయామని గ్రహిం చిన ఓ బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. సాంకేతిక ఆధారాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఉపయోగించిన ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల లావాదేవీలను విశ్లేషించి, వారి ఆచూకీని కనుగొన్నారు. ఈ మోసానికి పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు.