21-06-2024 12:00:00 AM
తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాలో కల్తీమద్యం కాటుకు 38 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశం యావత్తు దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. ఈ ఘటనలో చనిపోయిన వారంతా కరుణ పురం అనే ఒకే గ్రామానికి చెందిన వారు. కల్తీమద్యం సేవించిన మరో 100 మందిదాకా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నటు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. కల్తీమద్యం కాటుకు గురైన వారంతా రోజువారీ కూలీలేనని తెలుస్తోంది. మంగళవారం రాత్రి వీరంతా గ్రామంలోని రెండు అక్రమమద్యం దుకాణాల్లో ప్యాకెట్లలో దొరికే మద్యం సేవించారు.
తర్వాత అర్ధరాత్రి నుంచి ఒక్కొక్కరుగా కడుపులో మంట, తలనొప్పి, వాంతులు, కండ్లమంట లాంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. కానీ, కొన్ని గంటల్లోనే పలువురు ప్రాణాలు కోల్పోవడం మొదలయింది. బుధవారం రాత్రికి 13 మంది చనిపోగా, తెల్లవారేసరికి ఆ సంఖ్య 38కు పెరిగింది. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఘటనపై సీబీ సీఐడీ దర్యాప్తుకు ఆదేశించారు. జిల్లా ఎస్పీని సస్పెండ్ చేయడంతోపాటు కలెక్టర్‌ను బదిలీ చేశారు. అంతేకాదు, జిల్లా ఎక్సైజ్ విభాగంలో పనిచేసే మొత్తం సిబ్బందిని బదిలీ చేశారు. మరోవైపు మృతుల కుటుంబాలకు తలా రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.
ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ , రాష్ట్రంలో కల్తీమద్యం వ్యాపారాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని ప్రకటించారు. ఘటనా స్థలానికి ఐదుగురు రాష్ట్రమంత్రులను పంపించారు. ముఖ్యమంత్రి స్పందించిన తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. అసెంబ్లీ సమావేశాలకు ఒకరోజు ముందు ఘటన జరగడంతో ప్రతిపక్షాలకు డీఎంకే ప్రభుత్వంపై దాడికి బలమైన ఆయుధం దొరికినట్లయింది. ముఖ్యమంత్రికి పరిపాలన చేతకాదని, తక్షణమే రాజీనామా చేయాలని అన్నాడీఎంకే నేత, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి డిమాండ్ చేశారు.
మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పిలుపునిచ్చారు. ఘటనపై అత్యవసర విచారణ జరపాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో కీలక నిందితుడుగా భావిస్తున్న గోవిందరాజ్ అలియాస్ కన్నుకుట్టి ఉన్నాడు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. కల్లకురిచ్చి జిల్లాలో గత కొన్నాళ్లుగా కల్తీమద్యం వ్యాపారం విచ్చలవిడిగా సాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
నిజానికి ఈ జిల్లాలోనేకాదు తమిళనాడులోని అనేక జిల్లాల్లో నాటు సారా వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు, స్థానిక నేతల అండదండలతోనే ఇదంతా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి అండదండలతోనే ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు కూడా చెబుతున్నా రు. తమిళనాడులో మద్యం వ్యాపారం అంతాకూడా ప్రభుత్వ అధీనంలో ని షాపుల ద్వారానే సాగుతోంది. ఇక్కడ అమ్మే మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో పేదలు, రోజువారీ కూలీలు లాంటివాళ్లు తక్కువ ధరకు లభించే నాటు సారావైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే ఈ వ్యాపారుల పాలిట వరమైంది.
మత్తుకోసం మద్యంలో ప్రాణాంతకమైన మెథనాల్‌ను కలుపుతున్నట్లు సారా శాంపిల్స్ పరీక్షలో వెల్లడయింది. దీని మోతాదు ఎక్కువ కావడమే ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోవడానికి కారణమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో జిల్లాలోని మెథనాల్ నిల్వలపైనా పోలీసులు కన్నేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కరుణపురం గ్రామంలో పదుల సంఖ్యలో చిన్నారులు అనాథలుగా మిగిలారు. వీరి చదువులు, పోషణ భారం మోయలేని స్థితిలో చాలా కుటుంబాలున్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. అన్నిటికీ మించి మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోకుండా ఉండడానికి నాటు సారాపై ఉక్కుపాదం మోపాలని గ్రామస్థులు వేడుకొంటున్నారు.