10-12-2025 02:45:38 AM
విక్రయిస్తున్న ఇద్దరు ఉద్యోగులపై వేటు
వరంగల్ (మహబూబాబాద్), డిసెంబర్ 9 (విజయక్రాంతి): వరంగల్ నగరంలో ప్రతిష్టాత్మకమైన భద్రకాళి దేవాలయంలో నకిలీ టికెట్ల విక్రయాల ఘటన కలకలం సృష్టిస్తోంది. వాహన పూజకు సంబంధించి రూ.500 టిక్కెట్లను గత నెల 30న ఒకే నెంబర్‌పై మూడు జారీ చేయడంతో అనుమానం వచ్చిన ఓ భక్తుడు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ప్రాథమికంగా విచారణ జరిపిన దేవాలయ అధికారులు నకిలీ టిక్కెట్లు విక్రయించినట్లు గుర్తించారు.
బాధ్యులైన బుకింగ్ కౌంటర్లో విధులు నిర్వహిస్తున్న నరేందర్, శరత్ అనే ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు ఈవో రామల సునీత తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపితే అవకతవకలకు సంబంధించిన మరిన్ని ఘటనలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయని భక్తులు పేర్కొంటున్నారు. చాలాకాలంగా గుట్టుచప్పుడు కాకుండా నకిలీ టికెట్ల విక్రయ వ్యవహారం నడుస్తోందని, ఇందులో మరికొంత మంది పాత్ర ఉందని, పెద్ద ఎత్తున ఆలయానికి రావలసిన ఆదాయానికి గండి పడిందని, విజిలెన్స్ విచారణ జరిపించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.