07-10-2025 01:06:08 AM
మిర్యాలగూడ, అక్టోబర్ 7 (విజయక్రాంతి):- సోమవారం హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్‌లో బ్యాటరీ లోపంతో రెండున్నర గంటలపాటు మిర్యాలగూడలో నిలిచి పోయింది. ఉదయం 7:30 గంటలకు మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌కి చేరుకున్న రైలు ఇంజన్ మొరాయించడంతో ఆగిపోయింది. మొదట నడికుడి స్టేషన్‌లో మొరాయించడంతో ఇంజన్ తాత్కాలిక మరమ్మతులతో మిర్యాలగూడ స్టేషన్‌కు వచ్చి, ఆగిపోయింది.
దసరా సెలవుల అనంతరం హైదరాబాద్ వచ్చేందుకు ప్రయాణికులు రైలులో కిక్కిరిసిపోయేలా ఉన్నారు. రెండున్నర గంటలపాటు రైలు ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు ఇంజిన్‌లో మరమ్మతుల కోసం ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో భువనగిరి జిల్లా రామన్నపేట స్టేషన్ నుంచి మరో ఇంజన్‌ని అధికారులు రప్పించడంతో.. రైలు సికింద్రాబాద్ బయలుదేరింది.