07-10-2025 01:10:42 AM
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ బీసీకి వచ్చే అవకాశం ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అభిప్రాయప డ్డారు. రెండు, మూడు రోజుల్లో టికెట్ ఖరారు చేసే అవకాశం ఉందన్నారు. సోమవారం ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. అభ్యర్థి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మంగళవారం చర్చించి జాబితాను ఏఐసీసీకి పింపిస్తామన్నారు.
ఉప ఎన్నికలో ముగ్గురు ఇన్‌చార్జి మంత్రుల రిపోర్టు ఆధారంగా అభ్యర్థి ఎంపిక ఉంటుందని, గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలిచామని, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలోనూ గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ముగ్గురు మంత్రులతో కలిసి జూబ్లీహిల్స్‌లో బస్తీ బాట చేపట్టనున్నట్లు చెప్పారు. ఎంఐఎం మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, జనసమితి అభ్యర్థులకు స్థానిక పరిస్థితుల బట్టి టికెట్ల కేటాయింపులు ఉంటాయన్నారు.
బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో డిస్మిస్ అవుతుందని ముందే ఊహించామని పేర్కొన్నారు. డిసెంబర్ చివరి నాటికి పార్టీ పదవులన్ని పూర్తవుతాయని చెప్పారు. త్వరలోనే కామారెడ్డి బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. కాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా.. పొన్నం వ్యాఖ్యలను వక్రీంకరించారని, అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని మహేశ్‌కుమార్ చెప్పారు.