calender_icon.png 5 August, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాప్కోస్.. డీపీఆర్.. అంచనాలు..!

05-08-2025 01:59:04 AM

- ఒకదానికొకటి సంబంధం లేకుండానే జరిగాయని ఘోష్ కమిషన్ వెల్లడి

- డీపీఆర్ సిద్ధం చేయకుండానే కాళేశ్వరం పనులు ప్రారంభించిన వైనం

- డీపీఆర్ రాకుండానే ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు ఇచ్చినట్టు గుర్తించిన కమిషన్

- రెండు సార్లు పెంచిన ప్రాజెక్టు అంచనా వ్యయం

- సీడీవో డిజైన్ల తయారీలో ఎల్ అండ్ టీ సొంత డిజైన్ టీంతో పరిశీలన, జోక్యం

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన డీపీఆర్.. దీనిని సిద్ధం చేసిన వ్యాప్కోస్.. పరిపాలనా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం.. రెండుసార్లు ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం.. ఇవన్నీ పొంతనలేకుండా ఉండటాన్ని కాళేశ్వరం కమిషన్ స్పష్టంగా ఎత్తిచూపించింది. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలను వెల్లడించి.. కమిషన్ స్పష్టంగా ఎక్కడెక్కడ అవకతవకలు, అక్రమాలు, అవినీతి జరిగాయనేది స్పష్టంగా రాసిన నివేదికలోని పేజీలను కూడా బహిర్గతం చేశారు.

ఇందులో వ్యాప్కోస్, డీపీఆర్, ప్రాజెక్టు అం చనాలు అనే మూడు అంశాల మధ్య నడిచిన అవకతవకల తతంగం అప్పటి సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే నడిచిందనేది స్పష్టం చేస్తుంది. పైగా ప్రభుత్వంలో పెద్దలు నిర్ణయాలు తీసుకోవడం.. దానికి అనుగుణం గానే సర్వేలు, జీవోలు వెలువడినట్టుగా కమిషన్ నివేదిక స్పష్టం చేస్తుంది. 

- ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ తయా రు చేయమని వ్యాప్కోస్‌కు పనిని అప్పగించారు. అయితే వ్యాప్కోస్ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ తయారు చేయడానికి ముందే.. ప్రభుత్వం పెద్దలు పనుల ను కాంట్రాక్టర్లకు అప్పగించడం ఇక్కడ గమనార్హం. పైగా ఆయా కాంట్రాక్టు సం స్థలు డీపీఆర్ రాకముందే పనులు కూడా చేయడం మొదలెట్టారంటూ కమిషన్ స్పష్టంగా పేర్కొంది.

- వ్యాప్కోస్ సంస్థ సర్వే చేసి.. కాళేశ్వరం ప్రాజెక్టు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను 27.3.2016 నాడు ప్రభుత్వానికి అప్పగించింది. కానీ ఈ ప్రాజెక్టుకు సం బంధించి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 1.3.2016 నాడే పరిపాలనా అనుమతులివ్వడం గమనార్హం. డీపీఆర్ రాకముందే ప్రభుత్వం ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు ఇవ్వడాన్ని ఇక్కడ కమిషన్ తప్పుపట్టింది.

- అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశ ప్రధానమంత్రికి 11.2.2016 నాడు రాసి న లేఖలో.. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ. 71,436 కోట్లుగా పేర్కొన్నారు. అం టే ఇది కూడా వ్యాప్కోస్ డీపీఆర్ రావడానికి దాదాపు ఒకటిన్నర నెలల ముందే అప్పటి సీఎం ప్రాజెక్టు వ్యయం ఎంతో సాక్షాత్తు ప్రధానికి రాసిన లేఖలో చెప్పడం గమనార్హం.

- అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని మార్చడంపై హైపవర్ కమిటీకి నివేదించి పరిశీలన అనంతరం 22.10.2016 నాడు నిర్ణయం తీసుకున్నా రు. అయితే జూలై/ఆగస్టులోనే.. అంటే సుమారు మూణ్నాలుగు నెలల ముందుగానే ఆయా బ్యారేజీల పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించారు. పైగా బ్యారేజీల నిర్మాణ స్థలం మార్చడమనేది వ్యాప్కోస్‌కు చెప్పకుండానే చేశారని కమిషన్ స్పష్టంగా పేర్కొంది. అంటే వ్యాప్కో స్ సూచించిన స్థలంలో కాకుండా బ్యారేజీల నిర్మాణాన్ని వేరే స్థలానికి మార్చారు.

- ఇక డిజైన్లు తయారు చేయడంలో వ్యాప్కోస్ పాత్ర ఏమిటనే దానిపై కమిషన్ చేసిన విచారణలో ఆశ్చర్యకరమైన అంశాలు బయటపడ్డాయి. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజనీరు ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి.. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్‌లో కాంట్రాక్టు సంస్థ ఎల్ అండ్ టీ కి చెందిన సొంత డిజైన్ బృందం జోక్యం ప్రతి చోటా ఉండే ది. ఎల్ అండ్ టీకి చెందిన సొంత సాఫ్ట్‌వేర్ అబాకస్ (ఎఫ్‌ఈఎం అనాలసిస్), ఫ్లో 3డీ లతో డిజైన్లను పరిశీలిస్తూ ఉండే ది. కానీ ఇందుకు విరుద్ధంగా కాంట్రాక్టు సంస్థ మాత్రం ఇంజనీర్లు ఇచ్చిన డిజైన్ల ప్రకారమే తాము పనులు చేపట్టినట్టుగా తప్పుడు సమాచారం ఇచ్చినట్టు కమిషన్ అభిప్రాయపడింది.

- ఇక ప్రాజెక్టు నిర్మాణ వ్యయం విషయంలో రెండుసార్లు ఈ మార్పు చేసింద ని కమిషన్ స్పష్టంగా చెప్పింది. ప్రాథమికంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా రూ. 38,500 కోట్లు అని.. అయితే తర్వాత దీనిని రూ. 71,436 కోట్లుగా (సీఎం కేసీఆర్ 2016లో రాసిన లేఖ ప్రకారం) పేర్కొనగా.. చివరికి సవరించిన అంచనాలను బట్టి  రూ. 1,10,248.48 కోట్లుగా 2022 మార్చిలో పరిపాలనా అనుమతులు ఇచ్చినట్టు కమిషన్ గుర్తించింది.