12-11-2025 08:50:28 PM
చిట్యాల (విజయక్రాంతి): ప్రకృతి ప్రసాదించిన వరం ఆయిల్ ఫాం అని, ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు మరింత ఆదాయం చేకూరుతుందని నల్లగొండ జిల్లా పతంజలి సీనియర్ మేనేజర్ నర్రా రవీందర్ రెడ్డి బుధవారం తెలిపారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో అల్పం పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను, ఉద్యాన శాఖ, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ వారితో భాగస్వామి అవ్వాలని ఆదేశించిందని, వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఆదేశాలతో జిల్లా ఉద్యాన శాఖ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల భాగస్వామ్యంతో నల్లగొండ జిల్లాలో లక్ష ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు దిశగా ప్రణాళికలు రచించబోతున్నామని ఆయన తెలిపారు.
ఎకరానికి 57 మొక్కల చొప్పున మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగిస్తున్నామని, తదుపరి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి మాట్లాడుతూ వరి పంటకు ప్రత్యామ్నాయంగా, మూడు రెట్లు అధిక దిగుబడి, ఆదాయాన్ని అందించే సులభతరమైన బహువార్షిక వాణిజ్య పంట అయినటువంటి ఆయిల్ పామ్ పంట సాగు చేయాలని సూచించారు. ఆయిల్ పామ్ మొక్కను ఒకసారి నాటితే 4వ సంవత్సరం నుండి నిర్విరామంగా 30 సంవత్సరాల వరకు సరాసరిన ఎకరానికి 10 నుండి 12 టన్నుల దిగుబడినీ తీసుకోవచ్చు. ఎకరానికి లక్ష ఇరవై వేల నుండి లక్ష యాభై వేల వరకు నికర ఆదాయాన్ని పొందవచ్చు అలాగే ఈ పంటకు జంతువుల నుండి గానీ, దొంగల నుండి గానీ ఎటువంటి బెడద ఉండదు. ఆయిల్ పామ్ వేసిన రైతు ఈ పంట నుండి ప్రతి నెల ఆదాయాన్ని తీసుకొనే సౌకర్యం కలదు. మిగతా పంటలతో పోల్చినపుడు ప్రకృతి వైపరీత్యాలను, చీడ పీడలను తట్టుకునే శక్తి చాలా ఎక్కువఅని అన్నారు.
మరే పంటలో సాధ్యం కాని బహుళ పంటలు (మల్టీ స్టోరీడ్) పండించి బహుళ ప్రయోజనాలు పొందగలిగే అవకాశం ఉన్న ఏకైక పంట అనగా ఆయిల్ పామ్ మూడవ సంవత్సరం వయసు నుంచి ఇందులో అంతర పంటగా కోకో, వక్క, మిరియాలు, తమలపాకు, హెలికానియూమ్స్, రెడ్ జింజర్ వంటి అదనపు ఆధాయాన్నిచ్ఛే పంటలు పొందగలిగే వెసులుబాటు కలదు, మొక్కకు నీరు అందించే డ్రిప్ పరికరాలకు కూడా రాయితీ అందిస్తుంది. మొదటి నాలుగు సంవత్సరాలకి మొక్కల యాజమాన్యానికి ఎకరానికి 4200 చొప్పున ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రైతు ఖాతాలో జమ చేయబడుతుందని తెలిపారు. భూమి, నీటి వనరులు ఉన్న ప్రతీ రైతు సాంప్రదాయ వ్యవసాయ పంటల నుండి ఆయిల్ పామ్ ఉద్యాన పంటల వైపు రావాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సూచించారు. ఈ కార్యక్రమంలో టాక్స్ చైర్మన్ మల్లేష్ గౌడ్, రిజిస్టర్ అసిస్టెంట్ జ్యోతిర్మయి, సీఈఓ బ్రహ్మచారి, ఏఈఓ శశాంక, చిట్యాల ప్లాంటేషన్ ఆఫీసర్ వినయ్ కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.