14 July, 2026 | 4:06 AM

మాభూముల్లో తవ్విన కాలువ నీరు మాకు రాదా?

14-07-2026 01:32 AM

నీరు ఇవ్వకుంటే వదిలే ప్రసక్తిలేదు అంటూ రైతుల ఆగ్రహం

చండ్రుగొండ, జులై 13 (విజయక్రాంతి): మా భూముల్లో తవ్విన సీతరామ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాలువ నీరు మా భూముల్లో పంట పండించటానికి ఎందుకివ్వరంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండల రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సోమవారం చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామ శివారులో గల సీతరామ ప్రాజెక్టు పంట కాలువ వద్ద మండలానికి చెందిన రైతులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.... చండ్రుగొండ మండలం మీదుగా వెళ్లే సీతరామప్రాజెక్టు పంట కాలువ గుండా ప్రవహించే సాగునీరు మా మండలానికి ఎందుకివ్వటం లేదని ప్రశ్నించారు. తలాపన గోదావరి నీరు ఉన్న మండలం వ్యవసాయభూములకు సాగునీరు కరువైందన్నారు. ప్రాజెక్టు కాలువకు తక్షణమే గేట్వాల్ ఏర్పాటు చేయాలని, లేకుంటే కాలువకు తాత్కలికంగా బుంగ ఏర్పాటు చేస్తే మండలంలోని చెరువులు, కుంటల్ని నింపాలన్నారు.

పంటలు ఎండకుండా, ప్రస్తుత వర్షభావ పరిస్థితుల దృష్ట్యా నీటిని అందించాలన్నారు. అధికారులు భేషజాలకు పోకుండా మా మండలం నుండి, ముఖ్యం గా మా జిల్లా నుండి వెల్లే కాలువ ముందు కు మా భూములకు సాగునీరు అందించాలన్నారు. ప్రస్తుతం మద్దుకూరు గ్రామం వద్ద తాత్కలికంగా తూము, బుంగ ఏర్పాటు చేయటం వల్ల సుమారు రెండు వేల ఎకరాల పంట భూములు సాగు అవుతాయ న్నారు. అధికారులు, ప్రజాప్రతిని ధులు స్పందించి, మండల వ్యవసాయ సాగు భూములకు ప్రాజెక్టు నీరు వచ్చేలా కృషి చేయాలన్నారు. అయ్యన్నపాలెం, చండ్రుగొండ, మద్దుకూరు, దామరచర్ల, రావికంపాడు  రైతులు పాల్గొన్నారు