21 May, 2026 | 2:41 AM

గల్ఫ్ సంక్షోభం నష్టమే!

20-05-2026 12:00 AM

అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడులకు దిగితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ సామాజిక సంక్షోభాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే, కొవిడ్‌ను మించిన భయంకరమైన పరిస్థితులను ప్రపంచ దేశాలు చవిచూడాల్సి వస్తుంది.

అరబ్ స్టేట్స్ ఆఫ్ ది పర్షియన్ గ ల్ఫ్‌గా పిలువబడే ఏడు దేశాలు బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతా ర్, సౌదీ అరేబియా, యూఏఈలను సింపుల్‌గా గల్ఫ్ దేశాలుగా పిలుస్తారు. ఈ ఏడు దేశాలు ప్రపంచంలోనే అత్యధిక చమురు, గ్యాస్ నిల్వలు ఉన్న దేశాలుగా పేరుగాంచాయి. సుమారు ప్రపంచంలోనే 65% శాతం చమురు, 34% శాతం గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ దేశాల ఆర్థిక వ్యవ స్థలు అన్ని చమురు, గ్యాస్ ద్వారా వచ్చే ఆదాయం మీదే ఆధారపడి, అభివృద్ధి చెందుతున్నాయి.

అయితే ఈ దేశాలు సైనికపరంగా బలహీనంగా ఉండటం వల్ల అ మెరికాపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇందులో భాగంగా అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడానికి తమ భూభా గాలను అప్పగించాయి. దీంతో ఇరాన్‌పై అమెరికా ఫిబ్రవరి 28న యుద్ధానికి దిగడంతో, అమెరికా సైనిక స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లుతో దా డులకు దిగింది. ఇరాన్ చేస్తున్న దాడులతో చమురు, గ్యాస్ క్షేత్రాలు ధ్వంసం కావడంతో ఆయా దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షో భంతో అల్లాడుతున్నాయి.

ఒక పక్క ఇరాన్ యుద్ధం, మరో పక్క హార్మోజ్ జలసంధి మూసివేతతో గల్ఫ్ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇరా న్ దాడులతో చమురు బావులు, గ్యాస్ క్షేత్రాలు భారీస్థాయిలో ధ్వంసమవడంతో ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. భారత్‌కు నూ టికి ఎనభై శాతం చమురు, గ్యాస్ దిగుమతులు గల్ఫ్ దేశాల నుంచి, ముఖ్యంగా హా ర్మోజ్ జలసంధి ద్వారా వస్తాయనే విషయం విదితమే.

అయితే, ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా సంక్షోభం ఏర్పడటంతో ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. సాధారణ, పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం పడింది. చివరికి దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దుస్థితి దాపురించింది. తాజాగా ప్ర ధాని పొదుపు చర్యలు పాటించాలని హితబోధ చేశారు. ఇలా ఎంత కాలం అనేది కాలమే తేల్చాలి. ఇక ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో చమురు, గ్యాస్ ధరలు 50 శాతానికి పైగా పెరగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నది. ప్రస్తుతం ఇరా న్, -అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి.

ఇవి ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దీం తో ఏ క్షణాన్న ఏం జరుగుతుందోనని ప్రపంచ దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే ఇరాన్ దాడులతో బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా దేశాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ప్రపంచానికే ఎల్‌ఎన్జీ భారీస్థాయి లో సరఫరా చేసే ఖతార్ భారీగా దెబ్బతిం ది. ఎప్పుడు కోలుకుంటుదో చెప్పలేని స్థితి నెలకొంది. ప్రపంచంలోనే ధనిక దేశంగా వర్ధిల్లిన ఖతార్ కూడా ప్రస్తుతం ఆహారం కోసం ప్రపంచ దేశాల వైపు చూస్తుండటం ఎంతటి బాధాకరం.

20వ శతాబ్దంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ,జర్మనీ, ఇటలీకి చెందిన అనేక మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు గత మూడు దశాబ్దాలుగా గల్ఫ్ దేశాల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా చమురు, గ్యా స్, పర్యాటకం, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఉత్పత్తి తదితర రంగాల్లో భారీ ఎత్తున పె ట్టుబడులు పెట్టినట్టు తెలుస్తున్నది. అయి తే, ఈ యుద్ధం కారణంగా మొత్తం గల్ఫ్ దేశాల భవితవ్యం అగమ్యగోచరంగా త యారైంది. ఇప్పటికే కొంతమంది పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులను సింగ పూర్ వంటి దేశాలకు తరలించినట్టు నివేదికలు వస్తున్నాయి. 

ఈ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలతోపాటు ప్రపంచ దేశాలూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్ వ్యథను ప్రపంచ వ్యథగా చూడాలి. ముఖ్యంగా చమురు, గ్యాస్, ఎరువులు, వివిధ రకాల వస్తువుల కొరతతో అన్ని దేశాలు అల్లాడుతున్నాయి. ధరలు భారీగా పెరిగాయి. ద్రవ్యోల్బణం రోజురోజుకు పెరుగుతోంది. పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నది. దేశాల ఆర్థిక వ్యవస్థలు, జీడీపీ, తలసరి ఆదాయాలు క్షీణిస్తున్నాయి. ఇక రేపోమాపో అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడులకు దిగితే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ సామాజిక సంక్షోభాలు ఏర్పడే ప్రమాదం ఉంది.

ఒక్కమాటలో చెప్పాలంటే, కొవిడ్‌ను మించిన భయంకరమైన పరిస్థితులను ప్రపంచ దేశాలు చవిచూడాల్సి వస్తుందని పలువురు భయాం దోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా అమెరికా ఇరాన్ యుద్దం ముగింపునకు ఐరాస, ప్రపంచ దేశాలు, ముఖ్యంగా భారత్, చైనా, రష్యా, బ్రెజిల్ వంటి దేశాలు శాంతి చర్చలు జరపడానికి ముందుకురావాలి. ఇప్పటికే గల్ఫ్ దేశాలు 56 బిలియన్ డాలర్లు నష్టాలను చవిచూశాయి. సామ్రాజ్యవాద ఏకపక్ష ధోరణితో యుద్ధాలు, దాడులు చేసే హక్కు ఏ దేశానికి లేదని స్పష్టం చేయాలి. ఏ సమస్యకైనా శాంతిచర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుందని గ్రహించాలి. అంతర్జాతీయ వేదికలు, దౌత్య సంబంధాల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించాలని ఆశిద్దాం.

సెల్: 6305682733

ఐ.ప్రసాదరావు