calender_icon.png 2 November, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోయా టోకెన్ల జారీ.. క్యూలైన్లో తోపులాట

01-11-2025 02:31:53 PM

  1. ఇద్దరు మహిళల కాళ్లకు ఫ్రాక్చర్. 
  2. పలువురు రైతులకు స్వల్ప గాయాలు. 
  3. సోయా టోకెన్ల కోసం వేలాదిగా తరలివచ్చిన రైతులు. 
  4. పోలీసులు ఉండి కూడా ఏమి చేయలేని పరిస్థితి.
  5. బైంసా రూరల్ సిఐ చేరుకోవడంతో టోకన్ల జారీ ప్రక్రియ కొనసాగింపు.

కుభీర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal district) కుభీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో(Primary Agricultural Cooperative Society) శనివారం నుండి సోయా పంట కొనుగోళ్లకు సంబంధించిన టోకెన్లు జారీ చేస్తామని ప్రకటించడంతో రాత్రి రెండు గంటల నుండి మండలంలోని ఆయా గ్రామాల రైతులు చేరుకున్నారు. తెల్లవారుజాము నుండి ఆయా గ్రామాలను రైతులు వేలాదిగా చేరుకోవడంతో ప్రాంగణమంతా రైతులతో కిక్కిరిసిపోయింది. కుభీర్- భైంసా రహదారి ఇరువైపులా ద్విచక్ర వాహనాలతో అర కిలోమీటర్ మేర  నిండిపోయింది. క్యూలైన్లలో గంటల తరబడి ఈ రాత్రంతా వేచి ఉన్న రైతులకు తోడు మహిళా రైతులు ఉదయం నుండి బారులు తీరడంతో క్యూలైన్లలో తోపులాటలు ప్రారంభమయ్యాయి.

దీంతో ఒక్కసారిగా వెనుక నుండి రైతులు కార్యాలయం ముందు గద్దెపై ఉన్న రైతులను తోసేయడంతో పలుమార్లు తోపులాట జరగడం మూలంగా కింద పడ్డ రైతులపై పైనుంచి వందలాది మంది రైతులు పడిపోవడంతో కిందపడిపోయిన రైతులకు గాయాలయ్యాయి. ఇద్దరు మహిళా రైతులకు ప్యాక్చర్ కాగా మరో 8 మంది వరకు రైతులు గాయపడ్డారు. వందలాదిమంది రైతులు క్యూ లైన్లలో నిల్చలేక వెనుతిరిగి వెళ్లిపోయారు. ఆరువాలను కష్టించి పండించిన పంటలను అమ్ముకునేందుకు సైతం నానా ఇబ్బందులు పడుతూ కష్టాలను అనుభవిస్తున్నామని రైతులు వాపోయారు. కాళ్లు విరిగి గాయపడిన ఇద్దరు మహిళా రైతులను భైంసా ఆసుపత్రికి కుటుంబీకులు తరలించారు. కుబేర కృష్ణారెడ్డి సమాచారం మేరకు బైంసా రూరల్ సీఐ నైలు నాయక్ అక్కడికి చేరుకొని సిబ్బందికి పలు సూచనలు చేశారు.

రైతులు తీసుకొచ్చిన ఆధార్, పట్టా, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ప్రతులను ముందుగా కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత టోకెన్లు జారీ చేయాలని ఆదేశించడంతో మైకు ద్వారా రైతుల పేర్లను అనౌన్స్ చేసి టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగించారు. మండలంలో 76 గ్రామాలు 43 గ్రామ పంచాయతీలతో నిర్మల్ జిల్లాలోని అతిపెద్ద మండలం గా ఉన్నటువంటి కుబీర్ మండలంలో కొనుగోలు కేంద్రం ఒకటే ఉండడం ఈ పరిస్థితికి దారితీసిందని, ప్రభుత్వం మద్యం దుకాణాలు రెండింటికి అనుమతిస్తుంది కానీ రైతులు ఆరువాలను కష్టించి పండించిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు మాత్రం ఒకటే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని పలువురు రైతులు బాహటంగా విమర్శించారు. జిల్లా కలెక్టర్ దృష్టి సారించి మండల కేంద్రం కుభీర్ తో పాటు  మండలంలోని పల్సి మాలేగాం, చాత గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మండలంలోని తొమ్మిది వ్యవసాయ క్లస్టర్లలోని రైతు వేదికల్లో సోయా టోకెన్లను ఏఈవోలతో జారీచేసే విధంగా చర్యలు చేపట్టాలని పలు రైతులు డిమాండ్ చేశారు.