రైతుల భూములను మినహాయించాలి
- ఫార్మా సిటీ పేరు మార్చినా భూసేకరణ తీరు మారలేదు
- ప్రజాభిప్రాయ సేకరణ జ్యూరీ సభ్యులు
ముషీరాబాద్,ఆగస్టు 5 (విజయక్రాంతి) : ఫార్మా సిటీ పేరును ఫ్యూచర్ సిటీగా మార్చినా భూసేకరణ విధానంలో ఎలాంటి మార్పు లేదని ప్రజాభిప్రాయ సేకరణ జ్యూరీ నివేదిక ఆరోపించింది. బుధవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తిలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగా రూపొందించిన నివేదికను బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జ్యూరీ సభ్యులు వేమన వసంత లక్ష్మి(సీనియర్ జర్నలిస్టు), ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి (శాతవాహన విశ్వవిద్యాలయం), ఎస్.జీవన్ కుమార్ (మానవ హక్కుల వేదిక), టి. రఘునాథ్ (సీనియర్ హైకోర్టు అడ్వకేట్), వి.బాలరాజ్ (రిటైర్డ్ తహసీల్దార్), డాక్టర్ జి. విజయ్ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) విడుదల చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు బలవంతపు భూసేకరణ, పంటల ధ్వంసం, ఆన్లైన్ భూ రికార్డుల మార్పులు, ఉపాధి కోల్పోవడం వంటి సమస్యలు జ్యురీ దృష్టికి వచ్చిందన్నారు. భూసేకరణ నిలిపివేసి, రైతుల భూములను మినహాయించడం, భూ రికార్డులు పునరుద్ధరించడం, వ్యవసాయ కూలీలకు పునరావాసం కల్పించడం, ఎన్నికల హామీ మేరకు ఫార్మా సిటీ ప్రాజెక్టును అధికారికంగా రద్దు చేయాలని సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






