26-08-2025 03:00:31 PM
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
చిట్యాల,(విజయక్రాంతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో యూరియా సరఫరాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని నిరసిస్తూ నకిరేకల్ మాజీ శాసన సభ్యుడు చిరుమర్తి లింగయ్య నార్కట్ పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం వద్ద మంగళవారం రైతుల పక్షాన నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.
కేంద్రం యూరియా సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిల్వలు లేవని చేతులెత్తేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని దద్దమ్మ పాలన చేస్తోందని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ప్రజలను మోసం చేస్తూ గద్దెనెక్కి కూర్చుందని, రైతులు లైన్లలో నిలబడి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు అంటేనే ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆనాటి రోజులు తెస్తామన్నట్లే తెచ్చి చూపిస్తుందని
యూరియా కోసం లైన్లలో చెప్పులు పెట్టే దుర్మార్గపు పాలన తెచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు. రాష్ట్రంలో మంత్రులు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని ఒక మంత్రి యూరియా కొరత లేదని చెబుతుంటే మరో మంత్రి నిల్వలు లేవనిఒప్పుకుంటున్నారని, ఈ గందరగోళం వల్ల రైతులు రోడ్లపై పడుతున్నారంటే ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని పేర్కొన్నారు. రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే సీఎం అసలు స్పందించడం లేదని
రైతుల సమస్యలపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమని అన్నారు.ఇది రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమనేది స్పష్టంగా తెలుస్తోందని కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క రైతన్నకు కూడా యూరియా కొరత రాలేదని 24 గంటల కరెంట్ ఇచ్చి రైతుకు అండగా నిలిచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కాంగ్రెస్, బిజెపి రెండూ ఒకటే అని ఆరోపించారు. అధికారులు, మంత్రులు వెంటనే స్పందించి యూరియా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు.