26-08-2025 02:39:31 PM
హైదరాబాద్: యూరియా కోసం రైతులు ధర్నాలు చేస్తుంటే.. ముఖ్యమంత్రి(CM Revanth Reddy), మంత్రులు ఎక్కడ? సమస్యలు ఇక్కడుంటే సీఎం, మంత్రులు ఉండేది ఢిల్లీ, బిహార్ లోనా? అని మాజీ మంత్రి కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) ప్రశ్నించారు. రైతులు యూరియా కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ పార్టీలకు ఓట్లు.. రాష్ట్ర ప్రజలకు పాట్లు అన్నారు. యూరియా ఏదయా అంటే.. కాంగ్రెస్ ఎంపీలు తేలేరు.. బీజేపీ ఎంపీలు అడగరని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ గమనిస్తున్నది.. తెలంగాణ ప్రశ్నిస్తున్నదని కేటీఆర్ పేర్కొన్నారు.
''రైతుబిడ్డలు ఇక్కడ రాష్ట్ర సీఎం, మంత్రులు ఎక్కడ ? రైతన్నలు ఇక్కడ రాష్ట్ర సీఎం, మంత్రులు ఎక్కడ ? సమస్యలు ఇక్కడ ఉంటే సీఎం, మంత్రులు ఢిల్లీ, బీహార్లోనా ! రైతులు యూరియా కోసం తండ్లాతుంటే.. మీరు ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడికి ఎగిరిపోతారా ! జాతీయపార్టీలకు ఓట్లు.. రాష్ట్ర ప్రజలకు పాట్లు. యూరియా ఏదయా అంటే. కాంగ్రెస్ ఎంపీలు తేలేరు.. బీజేపీ ఎంపీలు అడగనే అడగరు.. తెలంగాణ గమనిస్తున్నది, తెలంగాణ ప్రశ్నిస్తున్నది'' అంటూ కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సహా ఆయన మంత్రివర్గ సహచరులు పలువురు మంగళవారం బీహార్‌లోని సుపాల్‌లో కొనసాగుతున్న 'ఓటరు అధికార్ యాత్ర'లో(Voter Adhikar Yatra) లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్, ఇండియా బ్లాక్‌కు చెందిన ఇతర ప్రతినిధులతో పాటు ప్రియాంగ గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ, ఉత్సాహంగా ఉన్న జనసమూహాన్ని చూసి చేతులు ఊపుతూ నెమ్మదిగా కదులుతున్న ఎస్‌యూవీ పైకప్పుపై కూర్చుని కనిపించిన చిత్రాలో ఇంటర్ నెట్ లో వైరల్ అవుతున్నాయి.