11 April, 2026 | 3:59 AM

ఇండస్ట్రియల్ పార్కుకు భూమి ఇవ్వండి.. రైతులకు అండగా ప్రభుత్వం

11-04-2026 02:19 AM

కలెక్టర్ హైమావతి

124 ఎకరాల్లో పరిశ్రమలు యువతకు ఉపాధి హామీ,

రైతులకు త్వరిత నష్టపరిహారం

హుస్నాబాద్, ఏప్రిల్ 10: హుస్నాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూమిని కోల్పోతున్న బాధిత రైతులకు ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ కె. హైమావతి హామీ ఇచ్చారు. భూ సేకరణ ప్రక్రియకు రైతులు సహకరించాలని ఆమె కోరారు.

శుక్రవారం హుస్నాబాద్ సమీకృత కార్యాలయ సముదాయంలోని మీటింగ్ హాల్లో టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న ఇండస్ట్రియల్ పార్క్కు సంబంధించి అక్కన్నపేట మండలం చౌటపల్లి, జనగాం, తోటపల్లి గ్రామాల రైతులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హుస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు 124 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అందించి ఇండస్ట్రియల్ పార్క్గా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

పరిశ్రమల స్థాపనతో ప్రాంతీయ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రాంత అభివృద్ధి కోసం భూమిని ఇవ్వడానికి రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజావసరాల కోసం భూమిని త్యాగం చేస్తున్న రైతులకు ప్రభుత్వం తరఫున న్యాయమైన, ఆమోదయోగ్యమైన నష్టపరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయడానికి రైతులు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, తహసిల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు.