8 June, 2026 | 1:47 AM

రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి

08-06-2026 12:09 AM

ఖమ్మం టౌన్, జూన్ 7 (విజయ క్రాంతి): ప్రస్తుతం వాతావరణ శాఖ అంచనాల ప్రకారం 2026 వానాకాలంలో ఎల్నినో ప్రభావం వల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లావ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, ఉద్యానవన శాఖ, భూగర్భ జల వనరుల శాఖలు సంయుక్తంగా గ్రామాల్లో రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.

వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చేసిందన్నారు. జూలై 15 వరకు వర్షాలు పడకపోతే సాగు చేయవలసిన పంటలు, జూలై 30 వరకు వర్షాలు ఆలస్యమైతే చేపట్టాల్సిన పంటల ప్రణాళిక, అలాగే ఆగస్టు 15 వరకు వర్షపాతం నమోదుకాకపోతే సాగు చేయాల్సిన పంటలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.