08-12-2025 09:04:47 PM
వరి విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తున్న శాస్త్రవేత్తలు..
కెవికె శాస్త్రవేత్త కిరణ్..
గరిడేపల్లి (విజయక్రాంతి): పోషకాహార ఉత్పత్తులపై రైతాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఏ కిరణ్ కోరారు. మండల పరిధిలోని గడ్డిపెల్లి కృషి విజ్ఞాన్ కేంద్రంలో జాతీయ ఆహార భద్రత, పోషకాహార మిషన్ ఆధ్వర్యంలో సోమవారం సామూహిక ప్రదర్శన క్షేత్రాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన శిక్షణ కార్యక్రమంలో రైతుల నిర్దేశించి ఆయన మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత పెరిగే దిశగా రైతాంగం వ్యవసాయం సాగు చేపట్టాలని కోరారు. పోషకాహార ఉత్పత్తులను సాగు చేసే విధంగా పలు రకాల విత్తనాలను శాస్త్రవేత్తలు కనుగొని రైతులకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
దీనిలో భాగంగానే డిఆర్ఆర్ - 48 సన్నగింజ రకాన్ని రైతులు సాగు చేసేందుకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ రకపు వరి విత్తనం 135 నుంచి 140 రోజుల వ్యవధి ఉంటుందని తెలిపారు. ఈ రకపు వరి గింజలో 23.3 పి పి ఎం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (జీ1-51.1) కలిగిన పౌష్టిక వరి రకమని తెలిపారు. ఈ రకాన్ని రాజేంద్రనగర్ లోని భారత వరి పరిశోధన సంస్థ అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ సంస్థ ద్వారా అభివృద్ధి చేసిన వరి విత్తనాన్ని డి ఆర్ ఆర్ -48(దాన్-48) బయో ఫోర్టిఫైడ్ వరి విత్తనం అని అంటారని తెలిపారు.
ఈ రకపు విత్తనం ఎండకు, తెగులును తట్టుకునే జన్యువులు కలిగి ఉండటం ద్వారా రైతులకు నాణ్యమైన పంటతో పాటు ఆదాయం పెరుగుతుందని తెలిపారు.ఈ విత్తన సాగుతో గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోప సమస్యలను తగ్గించవచ్చున్నారు. దీంతో పాటు వరి పంట సాగులో చీడపీడలు, తెగుళ్లు, ఎరువుల వినియోగం,నీటి నిర్వహణ,సరైన సాగు పద్ధతుల లాంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం డిఆర్ఆర్-48 బయో ఫోర్టిఫైడ్ వరి విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కెవికె శాస్త్రవేత్తలు ఏ. కిరణ్,సిహెచ్. నరేష్,డి. ఆదర్శ్,ఎన్. సుగంధి తోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు కె వి కె సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.