calender_icon.png 8 December, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీజన్ల సమస్యలపై రాజీలేని పోరు..

08-12-2025 09:36:11 PM

- ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ డివిజన్ సర్వసభ్య సమావేశం

- కంపెనీలేవల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ సత్తిరెడ్డి 

బెల్లంపల్లి (విజయక్రాంతి): తెలంగాణ ఎన్పీడీసీఎల్ లో పనిచేస్తున్న ఆర్టీజన్లు, విద్యుత్ ఉద్యోగుల హక్కుల సాధన కోసం టీఎప్ ఎన్ పీ డీసీ ఎల్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (1104) రాజీలేని పోరాటం చేస్తుందని ఆ సంఘం కంపెనీలెవల్ వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షుడు బొమ్మ సత్తిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం బెల్లంపల్లిలోని తాపీ కార్మిక సంఘం భవనంలో జరిగిన యూనియన్ డివిజన్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీజన్ల సమస్యల పరిష్కారం కోసం కంపెనీ స్థాయిలో అతి త్వరలోనే సమ్మెకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను ఉద్యోగులందరూ ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కంపెనీ పరిధిలోని 16 జిల్లాల్లో ఇప్పటికే పలు జిల్లాల్లో కమిటీలను బలోపేతం చేశామని, ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక సంఘం తమదేనని స్పష్టం చేశారు. 1999 నుంచి 2004 మధ్య నియమితులైన వారికి జీపీఎఫ్ వర్తింపజేస్తామన్న ప్రభుత్వ ప్రకటన సరికాదని, ఆ తర్వాత నియమితులైన విద్యుత్ ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

- నూతన కార్యవర్గం ఎన్నిక..

ఈ సమావేశంలో బెల్లంపల్లి డివిజన్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (1104) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజన్ అధ్యక్షుడిగా జి. పుండలీక్ రావు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కాండ్రాపు నరేష్, కార్యదర్శిగా అముదాల మార్కండేయ, అదనపు కార్యదర్శిగా గుండపు శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు.  ఈ ఎన్నికలు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్(1104) కంపెనీ లెవల్ వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షుడు బొమ్మ సతిరెడ్డి,  జిల్లా కార్యదర్శి దుండె కొండయ్య సమక్షంలో జరిగాయి. సమావేశంలో మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, మాజీ కార్యదర్శి మేకర్తి చంద్రయ్య, సీనియర్ నాయకులు మాచర్ల వెంకటేశం, మాల మల్లేష్, గుర్రం చంద్రమౌళి విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.