రైతు సంక్షేమమే లక్ష్యం: పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి
హైకోర్టు తీర్పుతో తిరిగి బాధ్యతలు స్వీకరణ
మొయినాబాద్, మే 7 (విజయక్రాంతి): రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని మొయినాబాద్ పీఏసీఎస్ చైర్మన్ ఎం. చంద్రారెడ్డి తెలిపారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో గురువారం ఆయన తిరిగి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది డిసెంబర్ 19న విఏసిఎస్ చైర్మన్, పాలకవర్గ పదవీకాలం ముగియడంతో దాదాపు నాలుగు నెలల పాటు చైర్మన్, డైరెక్టర్ల వ్యవస్థ లేకుండాపోయింది. అనంతరం ఎన్నికలు జరిగే వరకు కొనసాగింపునకు సంబంధించి చైర్మన్లు కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు అనుకూల తీర్పు ఇవ్వడంతో తిరిగి బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా చైర్మన్ చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ దర్గ మహేందర్ మాట్లాడుతూ రైతులకు సేవ చేసే అవకాశం మళ్లీ రావడం ఆనందంగా ఉందన్నారు. రైతుల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రైతులు దేశానికి వెన్నెముకలాంటివారని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలను సకాలంలో అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.మొయినాబాద్ విఏసిఎస్కు నూతన భవనం నిర్మాణం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు వెల్లడించారు. ప్రభుత్వం సహకరించి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో విఏసిఎస్ వైస్ చైర్మన్ దర్గ మహేందర్, సీఈవో, డైరెక్టర్లు రాంరెడ్డి, రాఘవేందర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, పొద్దుటూరి యాదయ్య, ఎన్. గంగమ్మ, విఏసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.






