12 May, 2026 | 1:24 AM

పాడు పనులకు ఫాంహౌస్లు..

12-05-2026 12:21 AM
  1. విలాసాల కోటలా? అసాంఘిక కార్యకలాపాల అడ్డాలా?
  2. ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న శివారు ఫాంహౌస్లు
  3. నేడు డ్రగ్స్, పేకాట మరియు రేవ్ పార్టీలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి
  4. ‘ప్రైవేట్ ప్రాపర్టీ’ అనే ముసుగులో  చీకటి దందాలు విలాసం వెనుక విష సంస్కృతి
  5. కేంద్ర మంత్రి బండి కొడుకు పై నమోదు అయినా ఫోక్సో కేసు తో మరోసారి వెలుగులోకి ఫామ్ హౌస్‌ల ఇష్యూ...

మొయినాబాద్, మే 11(విజయక్రాంతి):  హైదరాబాద్ మహానగర రణగొణ ధ్వనుల నుంచి ఉపశమనం పొందేందుకు మొయినాబాద్, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం,చేవెళ్ల వంటి ప్రాంతాల్లో సంపన్న వర్గాలు నిర్మించుకున్న ఫాంహౌస్లు ఇప్పుడు వివాదాలకు నిలయంగా మారాయి.వారాంతపు విడిది కోసం వెళ్లే కుటుంబాల కంటే, ’గలీజు’ పనుల కోసం వీటిని అద్దెకు తీసుకునే ముఠాలే ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఫాంహౌస్లలో రాజ్యమేలుతున్న అక్రమాలు.మత్తు సామ్రాజ్యం,గంజాయి, హుక్కాతో మొదలై ఖరీదైన సింథటిక్ డ్రగ్స్ వరకు ఇక్కడ యథేచ్ఛగా సరఫరా అవుతున్నాయి.

రేవ్ & ముజ్రా పార్టీలు..

 రాత్రంతా సాగే అశ్లీల నృత్యాలు, విదేశీ యువతులతో వ్యభిచారం వంటి ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. కోడి పందేలు, హై-స్టేక్స్ పేకాట స్థావరాలుగా ఇవి మారుతున్నాయి. లక్షలాది రూపాయల నగదు చేతులు మారుతున్నాయి.సామాన్యుల కంటే రాజకీయ, సినీ ప్రముఖుల ఫాంహౌస్లే ఎక్కువగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కుతున్నాయి. 

గతంలో పైలెట్ రోహిత్‌రెడ్డి..

ఫాంహౌస్ ‘ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంతోదేశవ్యాప్తంగాచర్చనీయాంశమైంది. ఇటీవల అదే ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీ ఉదంతం, గన్ ఫైరింగ్ కలకలం రేపింది. తాజాాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన కేసుతో ఫాంహౌస్ సంస్కృతిలోని మరో చీకటి కోణం వెలుగులోకి వచ్చింది.మాజీ మంత్రులు, ఎంపీల సన్నిహితులు సైతం కోడి పందేలు, జూదం నిర్వహిస్తూ పట్టుబడటం గమనార్హం.

పోలీసు నిఘా నీడన.. అయినా ఆగని దందా..

ఎస్.ఓ.టి  పోలీసులు నిరంతరం దాడులు చేస్తున్నా, నిర్వాహకులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. పార్టీల వివరాలు కేవలం వాట్సాప్ గ్రూపులు, క్లోజ్డ్ సర్కిల్స్లోనే పంచుకుంటారు.స్థానిక ఫాంహౌస్ వాచ్మెన్లు, మేనేజర్లు పోలీసుల కదలికలను ముందే గమనించి నిర్వాహకులను అప్రమత్తం చేస్తున్నారు. ఇటీవల ’ట్రాప్ హౌస్ 9 MM’ వంటి పార్టీల్లో మైనర్లు మత్తులో దొరకడం సమాజానికి ప్రమాద సంకేతంగా మారింది. 

కఠిన చర్యలు అవసరం 

ఫాంహౌస్లను కేవలం అద్దెకు ఇచ్చి చేతులు దులుపుకునే యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, అసాంఘిక కార్యకలాపాలకు వేదికైన ఫాంహౌస్లను సీజ్ చేయడమే దీనికి సరైన పరిష్కారం. ప్రశాంతమైన పల్లె వాతావరణం పాడు పనులకు అడ్డాగా మారకముందే ప్రభుత్వం మేల్కోవాలి.