16 August, 2026 | 8:58 PM

పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

16-08-2026 08:24 PM

చిట్యాల, ఆగస్టు 16 (విజయక్రాంతి): పారిశ్రామిక రసాయనాలను ట్యాంకర్ల నుంచి అక్రమంగా దారి మళ్లించి, డ్రమ్ముల్లో నిల్వ చేసి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్న ముఠాను చిట్యాల పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలిమినేడు గ్రామ శివారులో ఉన్న రాజస్థాన్ ధాబా వెనుక పార్కింగ్ ప్రదేశంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ నెల 15న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు అనుమానాస్పదంగా నిలిపిన వాహనాలను తనిఖీ చేయగా, ట్యాంకర్ లారీల్లో రవాణా చేస్తున్న పారిశ్రామిక రసాయనాలను గమ్యస్థానానికి పూర్తిగా చేర్చకుండా కొంత భాగాన్ని అక్రమంగా బయటకు తీసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ప్రధాన నిందితుడు చాపల సత్యనారాయణ అలియాస్ సతీష్ తన సహచరులతో కలిసి జాతీయ రహదారి-65పై ప్రయాణించే రసాయన ట్యాంకర్ డ్రైవర్లతో కుమ్మక్కైనట్లు తేలింది.

ట్యాంకర్లలోని సాల్వెంట్లు, ఐసోప్రొపైల్ ఆల్కహాల్, మిథనాల్ తదితర పారిశ్రామిక రసాయనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, తన ఆధీనంలోని వాహనాల్లో ఉన్న ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ చేసేవాడని పోలీసులు తెలిపారు. అనంతరం ఆ రసాయనాలను హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా లాభాలు ఆర్జిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

అరెస్టయిన నిందితులు చాపల సత్యనారాయణ అలియాస్ సతీష్ (32), బిపిన్ కుమార్ యాదవ్ (35), నవీన్ కుమార్ (31), ట్యాంకర్ డ్రైవర్, రాకేష్ ప్రసాద్ (45), అమిత్ కుమార్ (36) లు కాగా, స్వాధీనం చేసుకున్న ఐదు వాహనాలలో 2 బొలెరో వాహనాలను, ఒక మినీ డీసీఎం వాహనం ను,2 కెమికల్ ట్యాంకర్ లను వీటితో పాటు పారిశ్రామిక రసాయనాలతో నింపిన పలు ప్లాస్టిక్ డ్రమ్ములు, రసాయనాలను తరలించేందుకు ఉపయోగించిన పైపులు, ఇతర పరికరాలు, ట్యాంకర్లకు సంబంధించిన ఇన్వాయిసులు, రవాణా పత్రాలు, ఇతర రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రవాణా కోసం అప్పగించిన పారిశ్రామిక రసాయనాలను అక్రమంగా దారి మళ్లించి విక్రయించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు. ఈ అక్రమ రవాణా, విక్రయాల వెనుక మరికొంత మంది వ్యక్తుల ప్రమేయం ఉందా?  అనే కోణాల్లో  దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీఐ సిరికొండ సురేష్, ఎస్సై బీరెల్లి వెంకట్ రెడ్డి తెలిపారు.