26-12-2025 10:26:08 AM
ఇంటి నిర్మాణంలో చోటుచేసుకున్న విషాద ఘటన
చివ్వెంల,(విజయక్రాంతి): ఇంటి నిర్మాణ పనుల సమయంలో విద్యుత్ షాక్‌కు గురై తండ్రి, కొడుకు మృతి చెందిన హృదయవిదారక ఘటన చివ్వెంల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… చివ్వెంల మండల కేంద్రంలోని 7జీ కాలనీలో నివాసం ఉంటున్న మాదాసు బుచ్చయ్య (48) ఇంటి నిర్మాణానికి సంబంధించి బుధవారం మట్టితోలింపు పనులు చేపట్టారు. గురువారం సాయంత్రం పిల్లర్లకు నీళ్లు కొట్టేందుకు ట్రాక్టర్ ట్యాంకర్‌ను ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో ట్యాంకర్‌కు అనుసంధానించిన మోటర్‌ను ఆన్ చేసి నీళ్లు కొడుతుండగా, అకస్మాత్తుగా నీటితో పాటు విద్యుత్ సరఫరా కావడంతో బుచ్చయ్య తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కొద్ది నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్న అతని చిన్న కుమారుడు మాదాసు లోకేష్ (22) తండ్రి పరిస్థితిని గమనించకుండా ట్యాంకర్‌ను తాకడంతో అతడూ విద్యుత్ షాక్‌కు గురై నేలకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి తండ్రి, కొడుకులను సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషాదకర ఘటన గ్రామ ప్రజలను తీవ్రంగా కలిచివేయగా, కాలనీ అంతటా శోకసంద్రం నెలకొంది.