26-12-2025 02:59:42 AM
హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి) : రైతుల సౌకర్యార్థం వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టిన ఇంటి నుంచే యూరియా బుకింగ్ యాప్‌నకు రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రాష్ట్రంలోని ఐదు జిల్లాలో యూరియా యాప్‌ను పైలెట్ ప్రాజెక్టు కింద ప్రవేశపెట్టగా రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ నెల 20 నుంచి యూరియా బుకింగ్ యాప్ అదిలాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, జనగాం, పెద్దపల్లి జిల్లాల్లో అమలవుతోంది. పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్న ఈ ఐదు జిల్లాల్లో నాలుగు రోజులుగా 44,850 మంది రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని 1,39,000 యూరియా బస్తాలను కొనుగోలు చేశారు.
యాప్ ప్రారంభమైన రెండు రోజుల వరకు పైలెట్‌గా ఎంపిక చేసిన ఈ ఐదు జిల్లాల్లో 19,695 మంది రైతులు 60,510 యూరియా బస్తాలను మాత్రమే బుక్ చేసుకోగా, రెండు రోజుల వ్యవధిలోని యాప్ ద్వారా యూరియా కొనుగోలు డబు లైంది. 217 మంది కౌలురైతులు కూడా 678 యూరియా బస్తాలను బుక్ చేసుకున్నారు. అయితే మొదటి రోజు అక్కడక్కడ సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ..
వెనువెంటనే ఆ సమస్యను పరిష్కరిం చడంతో రైతులు తమ ఫోన్ నుంచి యాప్ ద్వారా కొనుగోలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. విడతలవారీగా మిగతా జిల్లాల్లోనూ యూరియా బుకింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. యూరియా కోసం రైతులు ఎరువుల దుకాణాలు, సహకార సంఘాల వద్ద క్యూలో నిలబడే తిప్పలు ఈ యాప్ ద్వారా తప్పాయని అధికారులు పేర్కొంటున్నారు.
విడతల వారీగా యూరియా పంపిణీ
యూరియా కోసం రైతులు ఒకేసారి కొనుగోలు చేయకుండా.. విడతలవారీగా ప్రభుత్వం అందజేస్తోంది. ఒక ఎకరాకు 3 బస్తాల యూరియా సరఫ రా చేస్తోంది. ఇంటి వద్ద నుంచే యూరియా బుక్ చేసుకునే అవకాశం లభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాసంగి సీజన్‌లోయూరియానే 10.40లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుంది.