26-12-2025 10:43:45 AM
హైదరాబాద్: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల-బత్తలూరు గ్రామాల మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. కారు ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులైన సాయి, సిద్ధార్థ నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో(Nandyala Government Hospital) చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి, రోడ్డు డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును ఢీకొట్టినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు తిరుపతి నుంచి హైదరాబాద్(Tirupati to Hyderabad)కు ప్రయాణిస్తోంది. మృతులైన ప్రయాణికులను హైదరాబాద్‌లోని నిజాంపేట(Nizampet) ప్రాంతానికి చెందిన గుండే రావు, శ్రవణ్, నరసింహ, బన్నీగా గుర్తించారు. గుండేరావు హైదరాబాద్ నిజాంపేటలో క్యాటరింగ్ నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
ఈ ఘోర ప్రమాదంపై మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి(Bobbala Chinnolla Janardhan Reddy) ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. జిల్లా అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించాలని, సంఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆయన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పెరుగుతున్న రహదారి ప్రమాదాల దృష్ట్యా వాహనదారులు, ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.