6 June, 2026 | 8:21 PM

పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన తండ్రి

06-06-2026 07:17 PM

న్యాయం జరిగే వరకు దిగనని పట్టుదల

రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది

చేగుంట,(విజయక్రాంతి): తన కుటుంబానికి న్యాయం చేయాలని, కుమారుడు మరణించిన నేపథ్యంలో అతని భార్యకు, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి హై టెన్షన్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలంలో శనివారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, చేగుంట మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన మారబోయిన నర్సిములు (55) గ్రామ మాజీ ఉపసర్పంచ్‌గా పనిచేశారు. ఆయన కుమారుడు 2015 సంవత్సరంలో గ్రామ శివారులో ఉన్న ఎంఎస్‌ఎన్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ప్రమాదవశాత్తు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అప్పటి నుంచి తమ కుటుంబానికి సరైన న్యాయం జరగలేదని, పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని నర్సిములు ఆరోపించారు. తన కుమారుడు మరణించి పదేళ్లు గడిచినా కుటుంబానికి ఎటువంటి ఉపాధి భరోసా లభించలేదని, కుమారుడి భార్యకు, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పలుమార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం లేకపోవడంతో నిరసనకు దిగినట్లు తెలిపారు.

శనివారం మధ్యాహ్నం  గ్రామ సమీపంలోని హై టెన్షన్  టవర్ ఎక్కిన నర్సిములు, తన డిమాండ్లు నెరవేరే వరకు కిందకు దిగేది లేదని ప్రకటించారు. టవర్‌పైకి ఎక్కి నిరసన తెలపడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న రామాయంపేట సి ఐ సైదా,చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి వెంటనే పోలీసు సిబ్బందితో పాటు రామాయంపేట్ అగ్నిమాపక శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. టవర్ కింద భారీగా ప్రజలు గుమిగూడగా, పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది రక్షణ చర్యలకు సిద్ధమయ్యారు.

హై టెన్షన్ టవర్‌పై ఉన్న నర్సిములతో పోలీసులు, అధికారులు మాట్లాడి కిందకు దిగాలని కోరారు. ఆయన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, చర్చల ద్వారా పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అయితే తనకు స్పష్టమైన హామీ, లిఖితపూర్వక భరోసా ఇచ్చే వరకు దిగబోనని నర్సిములు పట్టుదలగా నిలిచారు. దీంతో అధికారులు ఆయనను ఒప్పించే ప్రయత్నాలు కొనసాగించారు. ఘటన నేపథ్యంలో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

గ్రామస్తులు కూడా నర్సిములను క్షేమంగా కిందకు దిగాలని కోరగా, పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. నర్సిముల సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకునే దిశగా అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు కూడా కోరుతున్నారు. ప్రస్తుతం పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, రెవెన్యూ అధికారులు కలిసి నర్సిములను సురక్షితంగా కిందకు దించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.