ఫెడ్ రేట్, గ్లోబల్ ట్రెండ్‌పె దృష్టి
* ఈ వారం మార్కెట్ కదలికలపై విశ్లేషకుల అంచనాలు
ముంబై, డిసెంబర్ 15: యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం, భవిష్యత్తు రేట్లపై వెల్లడించే సంకేతాలు అంతర్జాతీయ మార్కెట్లకు కీలకమని, ఈ క్రమంలో గ్లోబల్ ట్రెండ్‌కు అనుగుణంగా భారత్ స్టాక్ సూచీల కదలికలు ఉంటాయని విశ్లేషకులు తెలిపారు. ఆరు వారాల భారీ పతనం అనంతరం నవంబర్ మూడోవారంలో మొదలైన రికవరీ గత వారం కూడా కొనసాగింది. డిసెంబర్ 13తో ముగిసినవారం మొత్తంమీద సెన్సెక్స్ భారీగా 623 పాయింట్లు లాభపడి 82,133 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 190 పాయింట్లు ఎగిసి 24,768 పాయింట్ల వద్ద నిలిచింది.
గ్లోబల్ ట్రెండ్స్..ప్రత్యేకించి యూఎస్ మార్కెట్ల కదలికలు, ఫెడ్ మానిటరీ పాలసీ నిర్ణయం భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపిస్తాయని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ చెప్పారు. అలాగే ఈ వారంలో వెలువడనున్న దేశీయ టోకు ద్రవ్యోల్బణం డేటా, విదేశీ, దేశీయ సంస్థాగత పెట్టుబడులపై ఆధారపడి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఉంటుందని వివరించారు. టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) డేటా సోమవారం వెలువడుతుంది. డాలర్ మారకపు రేటు, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలు కూడా మార్కెట్ దిశను నిర్దేశించే అంశాలేనని గౌర్ పేర్కొన్నారు.
తిరిగి వస్తున్న ఎఫ్‌పీఐలు
* డిసెంబర్‌లో రూ.22,766 కోట్లు పెట్టుబడులు
దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి అదేపనిగా అక్టోబర్, నవంబర్ నెలల్లో నిధుల్ని తరలించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్లు (ఎఫ్‌పీఐలు) తిరిగి దేశంలో పెట్టుబడులకు ఉపక్రమించారు. డిసెంబర్ నెల రెండు వారాలో ఎఫ్‌పీఐలు రూ.22,766 కోట్లు దేశీయ స్టాక్స్‌లో నికరంగా ఇన్వెస్ట్ చేసినట్లు డిపాజిటరీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో రూ.94,017 కోట్లు, నవంబర్‌లో రూ.21,612 కోట్ల చొప్పున ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కెట్లో నికర విక్రయాలు జరిపారు.
డిసెంబర్ రెండు వారాల్లో జరిపిన నికర పెట్టుబడులతో ఈ 2024 సంవత్సరంలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు రూ.7,747 కోట్లకు చేరినట్లు డిపాజిటరీల గణాంకాల్లో వెల్లడవుతున్నది. రిజర్వ్‌బ్యాంక్ తాజా పాలసీలో క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్‌ఆర్) తగ్గించడం, నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మెరుగుపర్చిందని వాటర్‌ఫీల్డ్ అడ్వయిజర్స్ సీనియర్ డైరెక్టర్ విపుల్ భోవర్ తెలిపారు.
డిసెంబర్‌లో ఎఫ్‌పీఐలు నికర కొనుగోళ్లు జరిపినప్పటికీ, కొన్ని రోజుల్లో మాత్రం భారీగా విక్రయించారని, మార్కెట్ గరిష్ఠస్థాయిల్లో ఉంటే వారు అమ్మకాలు జరుపుతారనడానికి ఇది సంకేతమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ వివరించారు. భారత మార్కెట్ విలువలు ఇతర మార్కెట్లతో పోలిస్తే ఎక్కువగా ఉన్నందున, ఎఫ్‌పీఐలు తిరిగి విక్రయాలకు పాల్పడే అవకాశం ఉన్నదని హెచ్చరించారు.
రానున్న రోజుల్లో భారత ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు అమెరికా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్ అమలుపర్చే విధానాలు, ద్రవ్యోల్బణం ట్రెండ్, కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల సరళిపై ఆధారపడి ఉంటాయని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు.




