calender_icon.png 17 January, 2026 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ అరెస్టులతో ఉద్యమం ఆగదు

17-01-2026 06:16:20 PM

– సికింద్రాబాద్ కార్పోరేషన్ కోసం ఉదృత పోరాటం

సనత్‌నగర్,(విజయక్రాంతి): సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నల్ల జెండాలు చేతబూని, మెడలో నల్ల కండువాలు వేసుకొని మోండా మార్కెట్ నుండి బాటా, జనరల్ బజార్ మీదుగా MG రోడ్ లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు చేరుకొని అక్కడ కొద్దిసేపు బైఠాయించారు.

అక్కడ కు చేరుకున్న పోలీసులు మీ ర్యాలీకి అనుమతి లేదంటూ అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ తో పాటు మిగిలిన వారిని అరెస్ట్ చేసి రాంగోపాల్ పేట పోలీసు స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ పోలీసు స్టేషన్ లో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ లష్కర్ జిల్లా ఏర్పాటు చేయాలని రెండు సంవత్సరాల నుండి పోరాడుతున్నామని చెప్పారు.  రాష్ట్రంలో ఒకటి, 4 నియోజకవర్గాలకు కూడా జిల్లాలు ఉన్నాయని, ఈ విషయాన్ని ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రస్తావించారని గుర్తు చేశారు.

అలాంటిది 14 నియోజకవర్గాలకు హైదరాబాద్ ఒక్కటే జిల్లా ఉన్నందున సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో లష్కర్ జిల్లా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఈ ప్రాంతం నుండి MP గా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఈ ప్రాంతానికే చెందిన ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ లకు విజ్ఞాపనలను అందజేసినట్లు వివరించారు. కాగా ఇటీవల GHMC ని డీ లిమిటేషన్ లో భాగంగా ప్రభుత్వం ORR వరకు విస్తరించి 300 డివిజన్ కు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే 300 డివిజన్ లను మూడు కార్పోరేషన్ లుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు.

మూడు కార్పోరేషన్ లలో 220 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరు, ఈ ప్రాంత అస్థిత్వాన్ని దెబ్బ తీసే విధంగా ప్రభుత్వం కుట్రలు చేస్తుందని చెప్పారు. GHMC ఏర్పాటుకు ముందు సికింద్రాబాద్ ప్రత్యేక మున్సిపాలిటీ గా ఉన్నదని ఆయన గుర్తు చేశారు. సికింద్రాబాద్ పేరుతోనే మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కు ఈ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని వివరించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు అందరికీ తమ ఉద్యమానికి మద్దతు తెలపాలని ఇటీవల లేఖలు కూడా పంపినట్లు వివరించారు.

ఈ ఉద్యమం రోజు రోజుకు మరింత ఉదృతం అవుతుందని తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ను తాము ఏమి చేయలేదని చెప్పారని, ముఖ్యమంత్రి చెప్పింది పూర్తిగా అసత్యం అని అన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని పోలీసు సర్కిల్స్, GHMC లోని కొన్ని డివిజన్ లను మల్కాజిగిరి పరిధిలోని జోన్ లలో చేర్చారని, ఇప్పటికే కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ ప్రాంత చరిత్ర, అస్తిత్వం రక్షించబడాలంటే సికింద్రాబాద్ కార్పోరేషన్ ఏర్పాటు తోనే సాధ్యం అన్నారు. దీనికోసం ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి శాంతి ర్యాలీకి పిలుపునిచ్చారని చెప్పారు.

ర్యాలీకి పోలీసు శాఖ అనుమతి కోసం ఈ నెల 5 వ తేదీన హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ లో దరఖాస్తు చేస్తే మా పరిధిలో కాదంటూ మల్కాజిగిరి కమిషనరేట్ కు తమ దరఖాస్తు పంపారని, అక్కడ మా పరిధి కాదంటూ సికింద్రాబాద్ DCP కి ఇలా అధికారులే కన్ఫ్యూజన్ కి గురై నారని వివరించారు. శుక్రవారం రోజు కూడా తాము ర్యాలీ నిర్వహించే ప్రాంతాలను పోలీసు అధికారులు పరిశీలించారని చెప్పారు. కాగా శుక్రవారం రాత్రి తమ ర్యాలీకి అనుమతి నిరాకరిస్తూ వాట్సాఫ్ ద్వారా సమాచారం ఇచ్చారని తెలిపారు.

అక్రమ అరెస్ట్ లతో ఉద్యమాన్ని అడ్డుకోలేరని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి అనుమతులు తెచ్చుకొని భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. అక్రమ అరెస్ట్ లతో పోరాటం ఆగదని చెప్పారు. ఈ రోజు చేపట్టిన ర్యాలీకి హాజరై మద్దతు తెలిపిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట మోండా డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, శ్రీహరి, నాగులు, కె.కిషోర్ కుమార్, కొండాపురం మహేష్ యాదవ్, ఆరీఫ్, నాగలక్ష్మి, అమర్, జగదీష్, సత్యనారాయణ, మహేశ్వర్ రెడ్డి, పాండు యాదవ్, లోకనాధం తదితరులు ఉన్నారు.