4 June, 2026 | 1:07 AM

వచ్చేస్తోంది.. సాకర్ కిక్కు

04-06-2026 12:00 AM

వారం రోజుల్లో ఫిఫా ప్రపంచకప్

అమెరికా, మెక్సికో, కెనడా ఆతిథ్యం

ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు పండగే

ఇప్పటికే మొదలైన సాకర్ ఫీవర్

మన దేశంలో క్రికెట్ ఓ మతం.. కానీ ప్రపంచంలో అత్యంత క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న ఆట ఏదంటే ఎలాంటి డౌట్ లేకుండా చెప్పే పేరు ఫుట్‌బాల్. ఎందుకంటే క్రికెట్ మహా అయితే ఓ 15 దేశాల్లో ఆడతారు. అదే సాకర్‌ను మాత్రం దాదాపు అన్ని దేశాల్లోనూ ఆడతారు. సంపన్న దేశాల నుంచి నిరుపేద దేశాల వరకూ ఫుట్‌బాల్ అంటే అభిమానుల్లో పిచ్చెక్కిపోతారు.

మన దేశంలో అంత ఆదరణ లేకున్నా వందలాది దేశాల్లో గల్లీ గల్లీల్లో సాకర్ ఆడుతూనే కనిపిస్తుంటారు. మరీ ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో అభిమానులు సాకర్ కిక్ కోసం పడిచస్తారు. అలాంటి క్రేజ్ ఉన్న ఫుట్‌బాల్ విశ్వసంబరం మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతోంది. సాకర్ లవర్స్ అత్యంత ఆత్రంగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ వచ్చే వారమే మొదలుకాబోతోంది. ఇక నెల రోజుల పాటు చాలా దేశాల్లో సాకర్ ఫీవరే.

న్యూయార్క్, జూన్ 3: సాకర్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఫిఫా ప్రపంచ కప్ మళ్లీ వచ్చేసింది. జూన్ 11 నుంచి ఈ సాకర్ ఫెస్టివల్ మొదలుకాబోతోంది. జూలై 19న జరిగే ఫైనల్‌తో సాకర్ సంబరం ముగుస్తుంది. అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో 48 జట్లు పోటీపడుతున్నాయి.

గత టోర్నీ వరకూ 32 జట్లు మాత్రమే ఉండగా ఈ సారి మరో 16 జట్లు పెంచారు. కొత్త ఫార్మాట్ ప్రకారం 48 జట్లను గ్రూపునకు 4 జట్ల చొప్పు 12 గ్రూపులుగా విభజించారు. లీగ్ దశలో ప్రతీ జట్టు తన గ్రూప్‌లోని మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతీ గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు మూడో స్థానంలో నిలిచిన జట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 8 జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్థాయి. తర్వాత 16 జట్లు ప్రీక్వార్టర్స్, అనంతరం 8 జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంటాయి.

ఈ కొత్త ఫార్మాట్‌తో అభిమానులకు గత టోర్నీలతో పోలిస్తే మరింత వినోదం ఖాయమని చెప్పొ చ్చు. టోర్నీలో జట్ల సంఖ్యను 48కి పెంచడంతో చాలా చిన్నదేశాలకు మెగాటోర్నీలో ఆడే అవకాశం లభించింది. ఈ నిర్ణయంతో తొలిసారి ఫిఫా ప్రపంచకప్‌కు నాలుగు కొత్త దేశాలు అర్హత సాధించి చరిత్ర సృష్టించాయి. కేప్ వెర్డ్, కురసావ్, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 2026 ప్రపంచకప్ ద్వారా తమ అధికారిక అరంగేట్రం చేయనున్నాయి.  గత టోర్నీకి ఆతిథ్య దేశంగా నేరుగా ఆడిన ఖతార్, ఈసారి క్వాలిఫైయింగ్ రౌండ్స్ ద్వారా అదరగొట్టి అద్భుత ప్రదర్శనతో ఎంట్రీ ఇచ్చింది. అలాగే అంతర్గత కల్లోలాలతో ఇబ్బందిపడుతున్న ఇరాక్ కూడా సాకర్ ప్రపంచకప్‌కు అర్హత సాధించడం మరో సంచలనంగా చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే ఒకప్పటి మేటి జట్టు ఇటలీ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోవడం అభిమా నులకు షాకే. ముఖ్యంగా సాకర్‌ను ప్రాణంలా ప్రేమించే దేశాల్లో ఒకటిగా ఉన్న ఇటలీ మెగాటోర్నీకి దూరం కావడాన్ని ఆ దేశపు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా ఎప్పటిలానే జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, అర్జెంటీనా, బ్రెజిల్ వంటి దేశాలు టైటిల్ రేసులో ముందున్నాయి. 2022లో విజేతగా నిలిచిన అర్జెంటీనా మరోసారి టైటిల్ నిలబెట్టుకునేందుకు ఉవ్విళ్లూరు తోంది. మెస్సీ నుంచి ఎంబాపే వరకూ పలు దేశాల సాకర్ స్టార్స్ విన్యాసాలు వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా దేశాల్లో సాకర్ ఫీవర్ ఓ రేంజ్‌లో ఉంది. మొత్తం 1248 ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడనుండగా.. మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో(పోర్చుగ ల్), గులెర్మో(మెక్సికో) రికార్డు స్థాయిలో ఆరోసారి ప్రపంచకప్ ఆడుతున్నారు.