లాసెట్‌లో 72 శాతం ఉత్తీర్ణత
మొత్తం 39,673 మంది పాస్
రెండు కోర్సుల్లో రాష్ట్రానికి మొదటి ర్యాంకులు
ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి
హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో గురువారం విద్యామండలి ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి.. ఉస్మానియావర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ మొలుగారం కుమార్, కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మీ, విద్యామండలి వైస్ చైర్మన్లు పురుషోత్తం, మహమూద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్‌తో కలిసి ఫలితాలను విడుదల చేశారు.
మూడేళ్ల లాకోర్సుకు 47,573 మంది అభ్యర్థులకు గానూ 38,261 మంది పరీక్ష రాశారు. అందులో 29,327 (76.65 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఐదేళ్ల లా కోర్సుకు 14,077 మం దికి 11520 మంది హాజరు కాగా.. 6,073 (52.72 శాతం) మంది అర్హత సాధించారు. ఇక పీజీ ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు 5,214 మం దికి 4,593 మంది పరీక్ష రాయగా 4,273 (93.03 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. మూడు కోర్సుల్లో కలిపి 66,864 మందికి గానూ 54,374 మంది పరీక్షలు రా యగా 39,673 (72.96 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.
సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు
లాసెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల కోర్సులో ఎ.సానిత్‌రెడ్డి (మేడ్చల్ మల్కాజ్‌గిరి), ఎల్‌ఎల్‌ఎం రెండేళ్ల కోర్సులో ఎస్. నిశిత(రంగారెడ్డి) రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకులు సాధించారు. ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల కోర్సులో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన ఎం.విజయదుర్గ ఫస్ట్ ర్యాం కు సాధించారు. లాసెట్ రాస్తున్న వారిలో డాక్టర్లు, ఇంజినీర్లు కూడా ఉంటున్నారని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు.
గతేడాది రాష్ట్రంలో మొత్తం 34 కాలేజీలు ఉండగా అందులో 9,990 సీట్లున్నాయని, వీటిలో కన్వీనర్ కోటా సీట్లు 8,254 ఉన్నాయన్నారు. వీటిలో 6,640 సీట్లు గత సంవత్సరం భర్తీ అయ్యాయని తెలిపారు. బీవోఎస్‌పై వర్సిటీలు అంగీకారం తెలిపాక మూడో ఫేజ్‌లో కొత్త కోర్సులను అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త కోర్సుల నిర్ణయాన్ని తాము వ్యతిరేకించలేదని ఈమేరకు ఓయూ వీసీ కుమార్ స్పష్టత ఇచ్చారు.
నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం జరగనున్నాయి. పాఠశాల విద్యాశాఖ హాల్‌టికెట్లను ఇప్పటికే అధికారికంగా విడుదల చేసింది. ఈ నెల 5 నుంచి 12 వరకు మధ్య లో ఎలాంటి సెలవులు లేకుండా పరీక్షలు వరుసగా జరగనున్నాయి. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. వీటికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేశారు.
లాసెట్‌లో మెరిసిన మాజీ మావో అగ్రనేత తిరుపతి
లాసెట్ ఫలితాల్లో మాజీ మావోయిస్టు అగ్రనేత ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. టి.తిరుపతి అలియాస్ దేవ్‌జీ ఐదేళ్ల లా కోర్సులో రాష్ట్ర స్థాయిలో 349వ ర్యాంకు సాధించారు. న్యాయ విద్యను అభ్యసించి పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలనే లక్ష్యంతో ఆయన చదువుబాట పట్టారు. 60 ఏళ్లు దాటిన వయసులోనూ చదువపై ఆయన చూపిన ఆసక్తి, పట్టుదల నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.






