calender_icon.png 21 February, 2026 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవిశ్వాసంపై రగడ!

12-02-2026 12:00:00 AM

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై మంగళవారం ప్రతిపక్షాలు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అవిశ్వాస తీర్మాన నోటీసును అందజేయడం రాజకీయ రగడకు తెరలేపింది. అమెరికా వాణిజ్య ఒప్పందం, మాజీ ఆర్మీ చీఫ్ నరవణె పుస్తక వివాదంపై చర్చకు అనుమతి ఇవ్వకపోవడం, ప్రతిపక్ష మహిళా పార్లమెంటు సభ్యులపై అసంబద్ధమైన ఆరోపణలు చేయడం, ప్రతిపక్ష కూటమికి చెందిన సభ్యులను సస్పెండ్ చేయడం ద్వారా ఓం బిర్లా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విపక్ష ఇండియా కూటమి ఆరోపిస్తూ వచ్చింది.

ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఓం బిర్లా పక్షపాత వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన 120 మంది సభ్యులు సంతకాలు చేసిన అవిశ్వాస తీర్మానాన్ని సెక్రటరీ జనరల్‌కు సమర్పించారు. అయితే తనపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యేంత వరకు సభకు దూరంగా ఉండాలని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకోవడం కొంత ఆశ్చర్యం కలిగించింది. అయితే స్పీకర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మాన ప్రయత్నం విజయవంతమవుతుందా అన్న విషయం పక్కనబెడితే, ఇది సభా సమయాన్ని వృథా చేయడం కిందకు వస్తుంది. పార్లమెంటు అనేది దేశంలో అత్యున్నత చర్చకు స్థానవేదిక.

ప్రజలు, సమస్యలు, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై అధికార, విపక్ష కూటముల మధ్య సానుకూల చర్చలకు సభలు పనిచేస్తాయి. కానీ ప్రజాస్వామ్య గొంతుకను చట్ట సభ్యులు తమ నిరసనలతో అణచివేయడానికి చేసే ప్రయత్నాలు ఏవైనా సమావేశాల నైతికతను ఉల్లంఘించడమే అవుతుంది. మరోవైపు పార్లమెంట్‌లో స్పీకర్ స్థానానికి చాలా ప్రాధాన్యముంటుంది. సభాపతి అంటే సమావేశాలను నిష్పక్షపాతంగా నడిపించడంతో పాటు సభా మర్యాదలకు భంగం వాటిల్లకుండా ఉదాసీనంగా వ్యవహరించాలి. కానీ, స్వయంగా స్పీకరే తన వ్యాఖ్యలు, చర్యలు, చేష్టలతో పరిస్థితులను ఉద్రిక్తం చేయడం సరికాదు.

ప్రధానిపై సభలో భౌతిక దాడి చేయడానికి కొందరు కాంగ్రెస్ ఎంపీలు కుట్ర చేస్తున్నారని తనకు తెలిసిందని, అందుకే మోదీని తానే సభకు రావొద్దని స్పీకర్ సభాముఖంగా ప్రకటన చేయడం విపక్షాలను అవమానించినట్లే అవుతుంది. ఒకవేళ ప్రతిపక్ష ఎంపీలు నిజంగానే ప్రధానిపై దాడి చేసి ఉంటే దేశ ప్రజలు వారిని ఎన్నటికీ క్షమించరన్న విషయం అధికార పక్షానికి తెలుసు. కానీ స్పీకర్ తన వ్యాఖ్యలతో అనవసరంగా సభను క్లిష్టంగా మార్చేశారనిపిస్తుంది. ప్రధాని ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించుకోవడం ద్వారా విపక్షాలకు సందు దొరికినట్లయింది.

ఇక ఆర్మీ మాజీ చీఫ్ నరవణే పుస్తకంలో ఏదో ఉన్నదనీ, దాని గుట్టును రాహుల్ సభలో విప్పుతారన్న భయంతో అధికారపక్షం స్పీకర్‌తో ఇలాంటి ఎత్తుగడలు వేసిందా అన్న అనుమానం ప్రజల్లో బలపడింది. ఇప్పటికే నిరసనల పర్వంతో బడ్జెట్ సమావేశాలు వాయిదా పడుతూనే వస్తున్నాయి.  తరచూ నిరసనలతో ప్రజాప్రతినిధులు విలువైన సభా సమయం వృథా చేస్తూనే వస్తున్నారు.

గతంలో లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తొలగించడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ అవేవీ విజయవంతం కాలేదు. తమకు తగిన సంఖ్యాబలం లేదని తెలిసినా స్పీకర్ తొలగింపుకు అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు పట్టుబట్టడం, మెజార్టీ సభ్యుల బలం తమదేనన్న ధీమాతో అధికార పక్షం కూడా ‘సరే కానివ్వండి’ అని పేర్కొనడం పార్లమెంట్ ఉత్పాదకతను దెబ్బతీసినట్లే అవుతుంది.