17 April, 2026 | 2:16 PM

Breaking News

కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •  

స్వదేశీ భావనకు ఆద్యుడు

12-02-2026 12:00 AM

నేడు స్వామి దయానంద సరస్వతి జయంతి :

స్వదేశీ భావనకు జన్మనిచ్చిన గొప్ప మార్గదర్శకుడు, ఆర్య సమాజం స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి. ఆయన అసలు పేరు మూల్ శంకర్ తివారి. స్వామి దయానంద సరస్వతి 1824 ఫిబ్రవరి12న గుజరాత్‌లోని టంకార గ్రామంలో లాల్జీ తివారి, యశోధ బాయ్ దంపతులకు జన్మించారు. 14 సంవత్సరాల వయస్సులో అతను తన తండ్రితో కలిసి శివాలయంలో జాగరణ చేస్తుండగా దేవుని ముందు ఉంచిన నైవేద్యాలకు ఎలుకలు ఆకర్షితులై  దేవుని విగ్రహం పైకి ఎక్కి అపవిత్రం చేయడం చూసి అర్థం లేని విగ్రహారాధన పట్ల విరక్తి చెందాడు. తన మామ మరణంతో కలత చెంది మత పరమైన సందేహలను నివృత్తి  చేసుకోవడానికి యోగా, శారీరక శిక్షణ అవసరం ఉందని గుర్తించాడు.

తన వివాహాన్ని వ్యతిరేకిస్తూ ఇం ట్లో నుంచి వెళ్ళిపోయిన దయా నంద సరస్వతి 1845 నుంచి 1860 వరకు దాదాపు 15 సం వత్సరాలు మతపరమైన సత్యా న్వేషణ కోసం భారతదేశమంత టా పర్యటించారు.1864లో స్వామి విరజానందకు శిష్యుడిగా మారి వేద విద్యను పూర్తి చేశారు. భారత దేశంలో వైదిక మత  పున:స్థాపనకై తన జీవి తాంతం కృషి చేశారు. వేదాల్లో చెప్పినట్లుగా ఉన్నతమైన భావాల ద్వారా విశ్వ మానవాళికి ఉపయోగపడే పది సార్వత్రిక సూత్రాలను ప్రకటించి 1875 ఏప్రిల్ 10న ముంబైలో ఆర్యసమాజ్‌ను స్థాపించారు. విద్యుత్ వాడకం లాంటి సాంకేతిక విషయాలు వేదాల్లో ఉన్నాయని బలంగా ప్రచారం చేశారు.

బాల్య వివాహాలను, కులాచారాలను, అంటరానితనం వ్యతిరేకిస్తూ వితంతు పునర్వివాహలను సమర్ధించారు.అన్ని కులాల వారికి వేద అధ్యాయాన్ని అందుబాటులోకి తెచ్చి విద్యాధార్మిక సంస్థలను స్థాపిం చారు. మహర్షి దయానంద సరస్వతి మొత్తం 70కి పైగా గ్రంథాలను రచించి వాటిలో ఆరు వేదాంగాలపై వివరణ ఇచ్చారు.ఆయన రచించిన వాటిలో సత్యార్థ ప్రకాష్, సంస్కార విధి, ఋగ్వేదాది భాష్య భూమిక, ఋగ్వేద భాష్యం ముఖ్యమైనవి. సత్యార్ధ ప్రకాశ్ ద్వారా వేదాల విశ్లేషణ, మూఢ నమ్మకాలను ప్రక్షాళన చేసి ప్రశంసలు అందుకున్నారు. ధార్మిక జీవనం కొనసాగిస్తూ వేద సారాంశాల గురించి ఉపన్యాసాలిస్తూ  జీవించారు.

1886లో బాలికల గురుకులాలు, దయానంద్ ఆంగ్లో- వేదిక్ పాఠశా లలు, కళాశాలలు స్థాపించబడ్డాయి. మహాత్మా హన్స్‌రాజ్ ఆధ్వర్యంలో లాహోర్‌లో మొదటి ఆంగ్లో వేదిక్ పాఠశాల ఏర్పాటు చేయబడింది. చివరకు ఒక సంస్థానాధీశుడిపై తీవ్రమైన విమర్శలు చేసిన దయానంద సరస్వతి 1883 అక్టోబర్ 30న మరణించారు. మహారాజు మద్దతుదారు ల్లో ఒకరు ఆయనకు విషమిచ్చి ఉండవచ్చనే అనుమానాలున్నాయి.

19వ శతాబ్దం చివర్లో ఆయన ఇచ్చిన ‘వేదాల వైపుకు తిరిగి వెళ్లండి’ (గోబ్యాక్ టూ వేదాస్) అనే పిలుపు ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన సామాజిక, నైతిక పరివర్తనకు నాంది పలికిందని చెప్పొచ్చు. అది నేటికీ కొనసాగుతోంది. ఆయన స్థాపించిన ఆర్య సమాజం జాతీయవాద స్ఫూర్తిని నెలకొల్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు. దయానంద సరస్వతి తన వాదనలను, ఉద్యమాన్ని సమర్థిస్తూ అథర్వణ, యజుర్వేదం వంటివి భాష్యం చేసిన వేదభాష్యకారుడిగా గుర్తింపు పొందారు.

 వేణుమాదవ్, హైదరాబాద్