16-02-2025 12:00:00 AM
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండూ బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారాయి. అయితే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు సైతం ఏమాత్రం తగ్గకుండా లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. అయితే పెళ్లి అనేది ప్రతిఒక్కరికీ కీలకమైన ఘట్టం కావొచ్చు. కానీ దీని కోసం ఖర్చు చేసేటప్పుడు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.
వివాహానికి ముందే బడ్జెట్‌ను నిర్ణయించుకోవడం ఉత్తమ మార్గం. కార్యక్రమాల ప్రాధాన్య తల ఆధారంగా అన్ని ఖర్చులను లిస్ట్ రాసుకోవాలి. బడ్జెట్ ఖర్చు పరిమితిని మించి ఉంటే, తక్కువ ప్రాధాన్యత గల కొన్ని ఖర్చులను తీసివేయాలి. ముఖ్యమైన ఖర్చులే కాకుండా, వివాహ సమయంలో ప్రణాళికలో లేని అనేక ఖర్చులు వస్తుంటాయి. వీటి గురించి కొంత ఆకస్మిక నిధిని కూడా దగ్గర పెట్టుకోవాలి.
ముందే ఆదా చేయాలి
వివాహ తేదీని నిర్ణయించిన తర్వాత డబ్బు గురించి ఆలోచిస్తూ కూర్చోకూడదు. కనీసం కొన్ని నెలల నుంచి ఆర్థికంగా సిద్ధం కావాలి. తప్పనిసరిగా దీనికోసం పొదుపు చేయడం ప్రారంభించాలి. మ్యూచువల్ ఫండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు లాంటివి పరిగణనలోకి తీసుకోవచ్చు. వివాహా తేదీకి ముందే నిధి లక్ష్యాన్ని చేరుకోవడానికి బోనస్, కాలానుగుణ ఆదాయాలను అందులో పొదుపు చేయాలి.
అవసరమైతేనే అప్పులు
పెళ్లి ఖర్చులు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువగా ఉండొచ్చు. డబ్బు అవసరాలకు స్నేహితులు, బంధువుల నుంచి నగదు ఏర్పాటు కావడం సులభం కాదు. అటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల ద్వారా వ్యక్తిగత రుణానికి వెళ్లడం మంచిదే. కొన్ని బ్యాంకులు వివాహ రుణాన్ని కూడా అందిస్తాయి. అయితే బహుళ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే బదులు, ఒకే రుణం తీసుకోవడం ద్వారా బడ్జెట్ అవసరాలను తీర్చుకోవడానికి ప్రయత్నించండి. అయితే అసలు ఖర్చు పెళ్లి అయిన తర్వాతే పెరుగుతుంది. కాబట్టి పెళ్లికి ముందే ఆర్థిక స్వేచ్ఛ వైపు అడుగులు వేయడం మరిచిపోవద్దు
తర్వగా బుకింగ్
వీలైనంత త్వరగా వివాహా వేదికపై నిర్ణయం తీసుకోవాలి. ఎంత త్వరగా బుక్ చేసుకుంటే అంత పొదుపు అవుతుంది. పెళ్లి వేడుక హోటల్ లేదా హాల్‌లో నిర్వహించుకుంటారా? అనేది ముందే నిర్ణయించుకోండి. అలాగే కనీసం మూడుపూ నెలల ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి. దాంతో కొంత ఆదా అవుతుంది.
బంగారం కొనేటప్పుడు
వివాహానికి కావాల్సిన కీలకమైన వస్తువులలో ఆభరణాలు ఒకటి. ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు తగిన దుకాణాన్ని ఎంచుకోవాలి. ప్రతి వస్తువుకు సరైన బిల్లు తీసుకోండి. బంగారం విషయంలో తరుగు కీలక పాత్ర వహిస్తుంది. తరుగు, ధరల విషయంలో ఇతర దుకాణాలతో పోల్చి చూడండి. అభరణాల దుకాణానికి సంబంధించిన రిటర్న్ రేటు, వర్తించే నిబంధనలు చెక్ చేసుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో అభరణాలను మార్చుకోవాలనుకున్నప్పుడు ఉపయోగంగా ఉంటుంది.
ఆదాను ఏం చేయాలంటే?
పెళ్లి కోసం మీరు కనీసం రూ. 25లక్షలు ఖర్చు పెట్టాలనుకుంటే.. దానిని రూ. 10లక్షలలోపు మొత్తంలో పూర్తి చేయడానికి ప్రయ త్నించండి. మిగిలిన రూ. 15లక్షలను ఏదైనా మంచి పెట్టుబడి పథకంలో ఇన్వెస్ట్ చేస్తే.. వచ్చే మూడు నుంచి ఐదేళ్ల కాల వ్యవధిలో మరింత రాబడి పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. అది భవిష్యత్తులో పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లకు ఉపయోగపడతాయి.