9 June, 2026 | 1:23 AM

తొలి వార్మప్ అదుర్స్

09-06-2026 12:00 AM

విండీస్‌ను చిత్తు చేసిన భారత్

శ్రేయాంక పాటిల్ స్పిన్ మ్యాజిక్

కార్డిఫ్, జూన్ 8: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. కార్డిఫ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ మహిళల జట్టును చిత్తు చేసింది. 26 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 179 రన్స్ చేసింది.

భారత్ ఇన్నింగ్స్ భారతి పుల్మాలి హాఫ్ సెంచరీతో రాణించింది. షెఫాలీ వర్మ 29, స్మృతి మంధాన 39, యస్తికా భాటియా 36 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్ 4 వికెట్లతో సత్తా చాటగా.. కరిష్క రామ్హరాక్, ఆలియా అలెన్, డియాండ్రా డొట్టిన్ తలో వికెట్ తీశారు.

అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు డాట్టిన్ (49), క్యాంప్‌బెల్ (25) మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 63 పరుగులు జోడించారు. అయితే భారత స్పిన్నర్ల ఎంట్రీతో విండీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. శ్రేయాంక పాటిల్ (4/36), రాధా యాదవ్ (3/25) తిప్పేసారు. ఫలితంగా విండీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులకే పరిమితమైంది. భారత్ తన రెండో వార్మప్ మ్యాచ్‌లో బుధవారం ఆతిథ్య ఇంగ్లాండ్‌తో తలపడుతుంది.