ఐదు గంటలు నీటిలోనే!
హనుమకొండలో ఓ వ్యక్తి హల్‌చల్
పోలీసుల రాక
బతికే ఉండటంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు
హనుమకొండ, జూన్ 10 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కేంద్రంలో సోమవారం వింత ఘటన చోటుచేసుకుంది. నగరంలోని రెండో డివిజన్ రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి పడిపోయి ఉన్నాడు. ఉదయం 7 గంటల నుంచి ఆ వ్యక్తిని గమనిస్తున్న స్థానికులు మధ్యాహ్నం 12 గంటల తర్వాత చనిపోయాడని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న కేయూ పోలీసులు వ్యక్తిని నీటిలో నుంచి బయటకు తీసే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా లేచాడు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఆగ్రహానికి గురై న పోలీసులు ఆ వ్యక్తిని మందలించగా ఎండ తీవ్రతకు తట్టుకోలేక నీటిలో పడుకున్నట్టు సమాధానమిచ్చాడు. సదరు వ్యక్తి నెల్లూరు జిల్లా కావలికి చెందిన వాడుగా గుర్తించిన పోలీసులు తాగిన మైకంలో ఆ విధంగా ప్రవర్తించినట్లు గుర్తించారు.






