31 March, 2026 | 2:27 AM

నంగునూరులో ఎగసిన అసమ్మతి జ్వాలలు

31-03-2026 12:30 AM
  1. మార్కెట్ కమిటీ నియామకాల్లో అన్యాయం అంటూ..

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూజల హరికృష్ణ దిష్టిబొమ్మ దహనం

మాకొద్దు ఈ ఇంచార్జి అంటూ కాంగ్రెస్ నాయకుల నిరసన 

డబ్బులకు అమ్ముడుపోతున్నాడని ఆరోపణ

ఒక వర్గం ఫ్లెక్సీ దహనం ..మరో వర్గం పాలాభిషేకం..

నంగునూరు, మార్చి 30:సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. నంగునూరు వ్యవసా య మార్కెట్ కమిటీ నియామకాలు పార్టీలో నిలువునా చీలిక తెచ్చాయి.నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ ఒక వర్గం నిరసనలకు దిగగా, మరో వర్గం ఆయనకు మద్దతుగా పాలాభిషేకాలు చేయడంతో సోమవారం మండలంలో ఉద్రిక్తత నెలకొంది.

చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న నంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్ల నియామకానికి సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేసింది.సీనియర్ నాయకులు దేవులపల్లి యాదగిరిని చైర్మన్గా, యూత్ కాంగ్రెస్ నాయకులు సాదుల పవన్ కుమార్ను వైస్ చైర్మన్గా, వారితో పాటు మరో 16 మందిని డైరెక్టర్లుగా నియమించారు.

ఆదివారం చైర్మన్ యాదగిరి ఇతర నేతలతో కలిసి జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ను కలవగా, మంత్రి.. పూజల హరికృష్ణ సమక్షంలో నియామక పత్రాన్ని అందజేశారు.సోమవారం సభ్యుల పేర్లు బహిర్గతం కావడంతో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి.మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా వద్ద మండల అధ్యక్షుడు తప్పెట శంకర్,గ్రామ శాఖ అధ్యక్షుడు అనరాజు నాగరాజు ఆధ్వర్యంలో పూజల హరికృష్ణ దిష్టిబొమ్మను, ఫ్లెక్సీని దహనం చేశారు.పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన సీనియర్లను విస్మరించారు.

డబ్బులకు అమ్ముడుపోయి, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి,కష్టపడని వారికి పదవులు కట్టబెట్టారు. ఒకే ఇంట్లో మూడు పదవులు ఇవ్వడం ఏంటి?‘ అని నాయకులు ప్రశ్నించారు.ఇంచార్జ్ వైఖరి వల్ల పార్టీ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని, వెంటనే అధిష్టానం జోక్యం చేసుకుని పూజల హరికృష్ణను తొలగించాలని డిమాండ్ చేశారు.ఒకే పార్టీకి చెందిన నాయకులు ఒకచోట దిష్టిబొమ్మ దహనం, మరోచోట పాలాభిషేకం చేయడం సిద్దిపేట రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ‘కేసులు మాకు.. పదవులు మీకా?‘ అంటూ అసమ్మతి నేతలు సంధిస్తున్న ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ముందుకు చేరాయి.

ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ నాయకులు అచ్చిన సత్తయ్య, గౌరబో యిన సంపత్,చలికాని యాదగిరి,సందబోయిన తిరుపతి యాదవ్, విక్రం రెడ్డి, జంగిటి శ్రీనివాస్, రాగుల కనకయ్య, రాగుల కృష్ణ, దేవులపల్లి ప్రసాద్, పంగ శేఖర్, దేవులపల్లి శంకరయ్య, ఆరేపల్లి సురేష్,కార్యకర్తలు పాల్గొన్నారు.

మరోవైపు హర్షం..పాలాభిషేకం

నిరసనలు ఒకవైపు కొనసాగుతుండగానే, రాజగోపాల్పేటలో మరో వర్గం నాయకులు హరికృష్ణకు మద్దతుగా నిలిచారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న తమకు తగిన గుర్తింపు లభించిందని ఆనందం వ్యక్తం చేస్తూ,ఇంచార్జ్ పూజల హరికృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.తమకు న్యాయం జరిగిందని, నియామకాలు పారదర్శకంగా ఉన్నాయని వారు స్పష్టం చేశారు.