19 June, 2026 | 1:31 AM

అసాంఘిక కార్యకలాపాల కట్టడిపై దృష్టి సారించాలి

19-06-2026 12:00 AM

ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిశీలన జిల్లా ఎస్పీ 

ఉట్నూర్, జూన్ 18 (విజయక్రాంతి) : రాత్రి వేళల్లో ప్రత్యేక గస్తి నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అదేవిధంగా గంజాయి రహిత జిల్లా నిర్మాణానికి పోలీస్ సిబ్బంది పాటుపడుతూ మాదకద్రవ్యాల నిర్మూలనకు విధుల నిర్వహణ చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్ ను పరిశీలించి, అనంతరం టీజీఎస్పీ సిబ్బందికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వంటగదిని ఉట్నూర్ ఎఎస్పి రుత్విక్ సాయి కొట్టే తో కలిసి జిల్లా ఎస్పీ ప్రారంభించారు.

టీజీఎస్పీ సిబ్బందికి రాత్రి సమయాలలో బీట్ వ్యవస్థను సక్రమంగా నిర్వహిస్తూ నేరాల నియంత్రణ కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా సాయంత్రం సమయాలలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రమాదాల నివారణలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. ఉట్నూర్ మండల వ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజలను ప్రోత్సహిస్తూ, వాటి ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని తెలియజేశారు.

ప్రతి గ్రామంలో గంజాయి వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ యువతను చైతన్యపరచాలని తెలిపారు. సిబ్బంది విధుల పట్ల అంకితభావం, సమయపాలన పాటించాలని సూచించారు. సక్రమంగా విధుల నిర్వర్తన చేపట్టి నేరాల నియంత్రణలో కృషి చేసిన సిబ్బందికి ప్రశంస పత్రాలు నగదు రివార్డులను అందజేసి అభినందించడం జరుగుతుందని తెలిపారు.

మండలంలో ఆర్థిక నేరాలు, దొంగతనాలు జరగకుండా పటిష్టమైన గస్తీ నిర్వహించాలని తెలిపారు. ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి కేసును నందు శిక్షలు పడే విధంగా దర్యాప్తు కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూరు సిఐ ప్రసాద్, ఎస్త్స్ర విజయ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.