calender_icon.png 17 July, 2025 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీ విస్తీర్ణం పెంపుపై దృష్టి

17-07-2025 01:13:09 AM

- ఫారెస్ట్ భూముల గుర్తింపు, పరిరక్షణకు కమిటీ ఏర్పాటు 

- తెలంగాణలో అడవుల విస్తీర్ణం 27,688 చ.కి.మీ.

- 2021 మధ్య 100.42 చ.కి.మీ. తగ్గుదల 

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): తెలంగాణలో అటవీ విస్తీర్ణం ఏటా తగ్గుతూ వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27,688 చ.కి.మీ. అటవీ విస్తీర్ణమే ఉందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇది రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 24.69 శాతం మాత్రమే. ఇటీవల విడుదలైన ఫారెస్ట్ సర్వే రిపోర్ట్‌లో 2021 2023 మధ్య దాదాపు 100.42 చ.కి.మీ. అటవీ భూమి తగ్గినట్టు వెల్లడైంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం అటవీ విస్తీర్ణం పెంచాలని నిర్ణయించింది.

ఓ వైపు వన మహోత్సవంలో భాగంగా చెట్ల పెంపకం చేపడుతూనే.. వాటి సంరక్షణకు కావాల్సిన చర్యల పై ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒక కమిటీని కూడా నియమిందింది. దేశవ్యాప్తంగా అటవీ భూముల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఇదివరకే పలు మార్గదర్శకాలను జారీ చేసింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు భూముల గుర్తింపు కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) డాక్టర్ సీ సువర్ణ చైరపర్సన్ గా ఆరుగురు సభ్యులతో తాజాగా కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీలో వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పర్ట్స్, రిటైర్డ్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శంకరన్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్టేషన్ ప్రతినిధి, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మాధవరావు, ఖమ్మం, రాజన్న జిల్లా అటవీశాఖ అధికారులను సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీ, అటవియేతర ప్రభుత్వ భూములను గుర్తించనుంది. ఒకవేళ ప్రభుత్వ భూము ల్లో చెట్లు, పొదలు ఉంటే దాన్ని డీమ్డ్ ఫారెస్ట్‌గా పేర్కొనుంది.

అటవీ భూములను గుర్తించి, వాటిని డాక్యుమెంట్ చేయనుంది. రెవెన్యూ, అటవీ శాఖల అధికారుల సమన్వయంతో జాయింట్ సర్వేలు చేపట్టనుంది. అటవీ భూముల అక్రమణలను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోకున్నారు. అటవీ భూములను రియల్ ఎస్టేట్,  మైనింగ్, ఇతర కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేయకుండా, పోరంబోకు, రెవెన్యూ, దేవాదాయం, ఇతర ప్రభుత్వ భూములకు రక్షణగా ఈ కమిటీ రిపోర్ట్ నిలుస్తుందని సంబందిత అధికారులు పేర్కొంటున్నారు.

అటవీ లక్షణాలుంటే డీమ్డ్ ఫారెస్ట్‌గా గుర్తింపు

అటవీ ప్రాంతంగా పరిగణించిన భూములు, అటవీ లక్షణాలు కలిగిన ప్రాంతం, అటవీ బయట ఉన్న భూములను గుర్తించడానికి ప్రభు త్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. ఇలాంటి భూమి ఎవరి ఆధీనంలో ఉన్నా.. వాటిని అటవీ భూముల జాబితాలో చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

అధికారికం గా అడవులుగా వర్గీకరించని ప్రాంతాలతో పాటు అడవు లుగా అర్హత ఉన్న భూములను గుర్తించి డ్యాక్యుమెంట్ చేయనుం ది. చట్టబద్ధంగా అటవీ ప్రాంతంగా ప్రకటించకపోయినా, వర్గీకరించకపోయినా అటవీ ప్రాంత లక్షణా లుంటే కమిటీ ఫీల్డ్ సర్వే చేసి డీమ్డ్ ఫారెస్ట్‌గా గుర్తించనున్నది. ప్రభుత్వ భూమి లో దట్టమైన చెట్లు, పొదలు పెరిగితే వాటిని కూడా అడవుల జాబితాలో చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.