17-07-2025 01:43:08 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం బల్దియా పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం క్రమక్రమంగా ఊపందుకుంటోంది. పట్టణ పరిధిలోని కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, సబ్ స్టేషన్ తండా, అమీనాపురం, దనసరి పరిధిలో ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలు 220 మందిని గుర్తించారు. అందులో ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం ఉన్న 174 మందికి తొలుత ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను అందజేశారు. ఆషాడమాసం కారణంగా చాలామంది కొత్త ఇంటి నిర్మాణానికి తొలుత కొంత ఆసక్తి చూపలేదు.
అయితే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉండడంతో తరువాత ఇంటి నిర్మాణం చేపడితే బిల్లు సకాలంలో వస్తుందో.. రాదో అనే అనుమానంతో ఇటీవల ఇండ్ల నిర్మాణం(Indiramma houses) ప్రారంభించారు. ఇప్పటివరకు కేసముద్రం పట్టణంలో 60 ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇండ్లు మంజూరైన 174 మంది లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణం చేపట్టే విధంగా అధికారులు, కాంగ్రెస్ నాయకులు కృషి చేస్తున్నారు. ఫలితంగా రోజుకు ఐదు నుంచి 10 ఇండ్ల వరకు గత వారం రోజులుగా ఇండ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దీనితో కేసముద్రం పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం విషయంలో కొంత ఊపు కనిపిస్తోంది.