17-07-2025 01:09:04 AM
- ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ఏడోసారి హాజరైన ప్రభాకర్‌రావు
- మూడు ఫోన్లు వాడితే.. ఒక్క ఫోన్ మాత్రమే అధికారులకు అందజేత
- ఫోన్‌లోని సమాచారం గాయబ్.. గుర్తించిన సిట్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 16 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. బుధవారం ఉద యం సిట్ అధికారుల ముందు ఏడోసారి విచారణకు ఆయన హాజరయ్యారు. ఈసారి విచారణలో పలు కీలక అంశాల ను ప్రస్తావిస్తూ ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం.
ప్రభాకర్‌రావు మూడు సెల్ ఫోన్స్ వాడినట్లు గుర్తించిన సిట్ అధికారులు ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తన వ్యక్తిగతమైన మొబైల్స్‌ను సిట్‌కు అందజేయాలని గతంలోనే సిట్ ఆదేశాలు ఇస్తూ నోటీసులు జారీ చేసింది. అయితే కేవలం ఒక మొబైల్‌ను మాత్రమే సిట్ అధికారులకు ప్రభాకర్‌రావు అందజేసినట్లు తెలుస్తోంది. ఏడోసారి సిట్ విచారణకు హాజరైన ఆయన, కీలకమైన మొబైల్ ఫోన్ల విషయంలో పొంతనలేని సమాధానాలిచ్చారని సమాచారం.
డేటాను పూర్తిగా క్లియర్ చేసి ఒకే ఒక్క ఫోన్‌ను అప్పగించడం, మిగతావి అమెరికాలో మర్చిపోయానని చెప్పడం సిట్ అధికారుల అనుమానాలను మరింత బలపరిచింది. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ ట్యాపింగ్ బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటివరకు సిట్ అధికారులు 269 మంది బాధితుల వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. మొత్తం 4,200కు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించారు. బాధితుల జాబితాలో అన్ని పార్టీల నాయకులు, గవర్నర్లు, హైకోర్టు న్యాయమూర్తులు, మీడియా సం స్థల ప్రతినిధులు, సినీ, ఐటీ రంగ ప్ర ముఖులు ఉన్నారు.
తీన్మార్ మల్లన్నకు సిట్ నోటీసులు..
సాధారణ ఎన్నికల సమయంలో ప్రభాకర్‌రావు బృందం తీన్మార్ మల్లన్న ఫోన్‌ను కూడా ట్యాప్ చేసినట్లు సిట్‌కు ఆధారాలు లభించాయి. దీంతో విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా సిట్ అధికారులు మల్లన్నకు సమాచార మిచ్చారు. గురువారం జూబ్లీహిల్స్ పో లీస్ స్టేషన్‌లో తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చే యనున్నారు. బాధితుల వాంగ్మూలాల ఆధా రంగా ప్రభాకర్‌రావును విచారించేందుకు సిద్ధమవుతోంది.