12-04-2025 12:00:00 AM
ఇటీవల ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జూమ్ మీటింగ్ పెట్టి అడ్మిషన్‌ల పెంపుదల విషయమై ప్రిన్సిపాల్స్, జూనియర్ లెక్చరర్లకు మార్గనిర్దేశనం చేసినట్టు తెలిసింది. 2025 అకాడమిక్ ఇయర్‌లో ఇప్పుడున్న అడ్మిషన్లను 30 శాతం పెంచాలని వారు చూచించారట. ఇక్కడే తిరకాసు ఉంది. చాలా ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులే లేవు. భవనాలు శిథిలావస్థకు చేరాయి. కనీసం వాటికి రంగులు వేసే పరిస్థితి అయినా లేదు. టాయిలెట్స్ నిర్వహణలు సరిగ్గా లేవు. నైట్ వాచ్‌మేన్స్‌కు తోడు చాలా కళాశాలల్లో కాంపౌండ్ వాల్స్ లేనందున అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి.
పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకునే వారే కరువయ్యారు. మరో ప్రాథమిక అవసరం నీటి సౌకర్యమూ అంతంత మాత్రమే. ప్రైవేట్ కళాశాలలు ఎంసెట్, నీట్ అంటూ కోచింగ్‌లకు తెరదీసి ఇంటర్‌లో ముందే అడ్మిషన్స్ తీసుకుంటున్నాయి. వారు ఏప్రిల్, మే నెలల్లోనే పోటీలు పడి సిబ్బందిని ఎన్నికల ప్రచారం కన్న ఎక్కువగా పిల్లలను ఆకర్షించేలా చేస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ అధ్యాపకులకు ఇంటర్ సప్లిమెంటరీ, మూల్యాంకనం ఇలా జూన్ సగం కన్నా ఎక్కువ కాలం పోతుంది. ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచుకోవాలని అనుకోవడానికి ముందు ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. డిగ్రీ, పీజీ ప్రభుత్వ కళాశాలల్లో ప్రత్యేక కోటా రిజర్వేషన్లు కల్పించడమూ అవసరం.
- ఉమాశేషారావు వైద్య, కామారెడ్డి
వయోవృద్ధుల సమస్యలు తీర్చండి!
డెబ్బయి సంవత్సరాలు దాటిన వయోధికులకు ‘ఆయుష్మాన్ భారత్’ వయో వందన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 5 లక్షల వరకు ఆరోగ్య భీమా సౌకర్యం ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ఎలాంటి ఆదాయ పరిమితి లేకుండా అందరికీ వర్తింప చేయనున్నట్టు ప్రకటించారు. ఇది కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నది. ఇందులో చేరిన వారికి అన్ని రకాల వైద్యం ఉచితంగా లభిస్తున్నట్టు చెబుతున్నారు. ప్రైవేట్ హెల్త్‌కార్డులు ఉన్నవారు, కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు అందించే సీజీఎచ్‌ఎస్ కార్డులు గలవారు కూడా అర్హులే అంటున్నారు.
ఈ వయో వందన కార్డు పొందాలంటే నేషనల్ హెల్త్ ఏజెన్సీ వెబ్‌సైట్ లేదా ఆయుష్మాన్ మొబైల్ ద్వారా ఈ కేవైసి ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంటుంది. ఆధార్ కార్డ్ వివరాల ప్రకారం అప్లికేషన్ పూరించాలి. అయితే, గత వారం రోజుల నుంచి వెబ్‌సైట్ సందర్శిస్తే ఆయుష్మాన్ వయోవందన కార్డు డౌన్‌లోడ్ కావటం లేదు. కేవలం అప్రూవల్ మాత్రమే చూపిస్తున్నది. చాలామంది పేదలు, మధ్యతరగతి వృద్ధులు ప్రైవేట్ హాస్పిటల్ బిల్లులు భరించలేక బాధ పడుతున్నారు. అవసాన దశలో ఉన్న వయోధికులకు ఆత్మగౌరవంతో కూడిన ఆరోగ్య రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆయుష్మాన్ వయోవందన పథకం అమలుకు ఉత్తర్వులు జారీ చేయాలి.
- ఆళవందార్ వేణుమాధవ్, హైదరాబాద్