calender_icon.png 25 July, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంది పప్పు కహానీ.. దాల్ మే కాలా!

24-07-2025 01:35:27 AM

అంగన్‌వాడీలకు పంపిణీలో జిల్లాకో రేటు

మార్కెట్ రేటు కంటే 25 శాతం అధికం 

  1. అడిషనల్ కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు
  2. అయినా కొనుగోలులో అవకతవకలు 
  3. ఆఫ్రికన్ పప్పు ఆరోగ్యానికి ప్రమాదకరం
  4. కట్టడి చేయకపోతే అంగన్‌వాడీ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం 
  5.  అధిక రేటుకు కంది పప్పు కొనుగోలుతో ప్రభుత్వానికి భారీగా నష్టం

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి) : అంగన్‌వాడీ వర్కర్లకు కందిపప్పును ప్రభుత్వం సరఫరా చేయడం మంచి పరిణామమే. కానీ ప్రభుత్వం కంది పప్పు సరఫరా చేసేందుకు సేకరించే ప్రక్రియలో భారీ కుంభకోణం జరుగు తున్నది. ఆయా అడిషనల్ కలెక్టర్ల ఆధ్వర్యంలోని కొనుగోలు కమిటీ కందిపప్పు కొనుగోలు రేటును ఖరారు చేస్తుంది. కానీ ఆశ్చర్యకరంగా కొన్ని జిల్లాల్లో ఎలాంటి ఈ లేకుండా అధిక రేట్లకు కొనుగోలు ఆర్డర్‌ను ఇచ్చారు.

ఈ విషయం మహిళా సంక్షే మ శాఖ కమిషనర్ దృష్టికి రావడంతో అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లను హెచ్చరించారు. ఆయా జిల్లాల్లో మళ్లీ టెండ ర్లను నిర్వహించాలని ఆదేశించారు. ఇతర జిల్లాల తరహాలోనే కేజీ కంది పప్పు రేటు రూ.118 నుంచి  రూ. 130 మధ్యలో ఉండాలని సూచించారు. అయినప్పుటికీ కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా పేరుకే ఈ ప్రక్రియను నిర్వహించారు.

రైస్ మిల్లర్లు, రైతు ఉత్పత్తి సంస్థలు సదరు కంది పప్పు, సరఫరాకు పనికిరాద ని సూచించినప్పటికీ దానిని అధిక రేటుకు అంగన్‌వాడీలకు సరఫరా చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ. 118  నుంచి రూ. 130 ఉండాల్సిన రేటును అమాంతం రూ. 153 నుంచి రూ. 162కు పెంచారు.

సాధారణంగా మార్కెట్‌లో ఉన్న కంది పప్పు రేటు కంటే 25 శాతం అధిక రేటుకు సరఫరా చేస్తున్నారు. అందులోనూ అత్యధిక రేటు టెండర్ వేసిన ఒకే ఏజెన్సీకి కొనుగోలు ఆర్డర్ కట్టబెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. దీంతో ప్రజాధనం కోట్లలో దుర్వినియోగం అవుతున్నది. 

జిల్లాల వారీగా..

ఒక్కో జిల్లాల్లో ఒక్కో రేటుతో అంగన్‌వాడీలకు కంది పప్పును సరఫరా చేస్తున్నారు. వాటిలో ములుగు జిల్లాలో రూ. 153, వరంగల్‌లో రూ. 152, ఆదిలాబాద్‌లో రూ. 162, మహబూబాబాద్‌లో రూ. 154, జయశంకర్ రూ. 152, భద్రాద్రి కొత్తగూడెంలో రూ. 153, ఖమ్మం జిల్లాలో రూ. 155కు కంది పప్పు సరఫరా చేస్తున్నారు. ఈ అంశంపై మహిళా-శిశు సంక్షేమ శాఖ కమిషనర్ తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అధిక రేట్లకు సరఫరా చేస్తున్న టెండర్లను రద్దుచేయాలి. మళ్లీ సాధారణ రేట్లతో కొత్తగా టెండర్ల ప్రక్రియ నిర్వహించాలి. దీంతోపాటు అధిక టెండర్లు కట్టబెట్టిన ప్రక్రియతో సంబంధం ఉన్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కంది పప్పు సరఫరా చేసే ఆయా ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టాలి. 

ఆఫ్రికన్ కంది పప్పు ప్రమాదకరం..

అంగన్‌వాడీలకు ఆఫ్రికన్ కంది పప్పు వెరైటీని సరఫరా చేయనున్నారు. అయితే దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉ న్నది. ఎందుకంటే ఆఫ్రికన్ కంది పప్పు వెరైటీ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. ఈ వెరైటీ కంది పప్పు అంగన్‌వాడీలకు సరఫరా చేస్తే అందులోని పిల్లలు, అంగన్‌వాడీ వర్కర్ల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉన్నది. ఈ క్రమం లో అంగన్‌వాడీలకు ఆఫ్రికన్ వెరైటీ కంది పప్పును సరఫరా చేయకుండా చర్యలు తీసుకోవాలి.

దీంతోపాటు అంగన్‌వాడీలకు సర ఫరా చేసే కంది పప్పుకు, వాటికి సంబంధించిన బిల్లులకు పొంతన లేకుండా ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి అధిక మొత్తంలో నష్టం వాటిల్లుతున్నది. అంగన్‌వాడీలకు సరఫరా చేసే కందిపప్పు క్వాలిటీ, క్వాంటిటీని ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నది.