calender_icon.png 25 July, 2025 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏజెన్సీ ప్రజలకు ఆధునిక వైద్యం అందుబాటులోకి తెస్తాం: ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు

24-07-2025 08:35:09 AM

చర్ల,  (విజయక్రాంతి):  ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఆధునిక వైద్యం అందుబాటులోకి తెచ్చే సంకల్పంతో అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. చర్ల సిహెచ్సిలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్ ను ఆయన డి సి హెచ్ ఎస్ డాక్టర్ రవిబాబు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృత నిశ్చయంతో ఉందన్నారు. అందులో భాగంగా వైద్య శాఖకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోందన్నారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రి తరువాత చర్ల సిహెచ్ సి ను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలకు ఎక్కడైనా అవసరం ఉంటే తాను వైద్య సేవలు అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. చర్ల లో  30 పడకల భవన నిర్మాణానికి రూ. 10 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.

ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో భవన నిర్మాణ పనులను ప్రారంభమవు తాయన్నారు. గతంలో ట్యూబెక్టమీ ఆపరేషన్ కోసం 60 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలం ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉండేదని, ప్రస్తుతం చర్ల ఆసుపత్రిలో ఈ ఆపరేషన్లు అందుబాటులోకి రావడం సంతోషదాయకమన్నారు. ప్రధానంగా ఇక్కడి సిహెచ్ సి లో వైద్యులు, సిబ్బంది భర్తీ కోసం  వైద్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఏజెన్సీ ప్రజలకు వైద్య సేవలు అందించడంలో శక్తివంచన లేకుండా వైద్యులు, సిబ్బంది పని చేయాలని కోరారు. అవసరమైతే తాను సైతం వచ్చి వైద్య సేవలు అందించటానికి సిద్ధమన్నారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రామకృష్ణ, చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు, వైద్యాధికారులు డాక్టర్ సాయి వర్ధన్, పెద్దాడ కాంత్, జగన్ తదితరులు పాల్గొన్నారు,