calender_icon.png 25 July, 2025 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలోనే సీఎం.. నేడు అగ్రనేతలతో భేటీ

24-07-2025 09:26:08 AM

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో(CM Revanth Reddy Delhi Tour) పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేను రేవంత్ రెడ్డి కలవనున్నారు. గురువారం సాయంత్రం కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై లోక్ సభలో, రాజ్యసభల్లో ఒత్తిడి చేయాలని సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. రేవంత్ రెడ్డి ఇండియా కూటమిలోని ఇతర పార్టీల ఎంపీల మద్దతు కోరనున్నారు. 9వ షెడ్యూల్ లో చేర్చేందుకు ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.

తెలంగాణలో వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌తో స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) కృత‌నిశ్చ‌యంతో ఉన్నదని ముఖ్య‌మంత్రి నిన్న ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్ప‌ష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభ ఆమోదించిన బిల్లులకు చట్టబద్ధత కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి ఢిల్లీ వచ్చినట్టు వివరించారు.

బీసీల‌కు విద్యా, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్లు, అలాగే స్థానిక సంస్థ‌ల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి తెలంగాణ శాస‌న‌స‌భ పూర్తిస్థాయిలో చర్చించి ఆమోదించిన రెండు బిల్లుల‌ను ఆమోదించ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం తాత్సారం చేస్తోంద‌న్నారు. తెలంగాణ హైకోర్టు(Telangana High Court) 90 రోజుల్లో స్థానిక సంస్థ‌లు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని, 30 రోజుల్లో రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు చేయాల‌ని ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పలువురు ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.